ఆంధ్రప్రదేశ్‌లో హిందువులను అణిచివేస్తే సునామీ సృష్టిస్తామన్నారు స్వామి పరిపూర్ణానంద. రాష్ట్రంలో పథకం ప్రకారమే హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో డెల్టా వేరియంట్ పేరుతో హిందువుల పండుగలపై ఆంక్షలు పెట్టిన జగన్ సర్కార్.. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఉన్న సమయంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని.. వైసీపీకి 151 సీట్లు వచ్చాయంటే అందులో కోటి 40 లక్షల ఓట్లు కేవలం హిందువులు వేశారన్నారు. అంతర్వేది రథం కాలపెడితే నిందితులను పట్టుకుని శిక్షించాల్సింది పోయి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఇదే ఘటన యూపీలో జరిగి ఉంటే.. యోగీ ఆదిత్యానాథ్ నిందితుల ఆస్తులను జప్తుచేసి ఉండేవారన్నారు. రామతీర్థంలో దేవుడి తల తొలగిస్తే కూడా ఇదేవిధంగా వ్యవహరించారని.. హిందువుల ఆవేదన వైఎస్ జగన్ సర్కార్‌కు తెలియడం లేదన్నారు. వేయి కాళ్ల మండపం పునరుద్ధరిస్తామని జీయర్ స్వామి సమక్షంలో చెప్పి.. ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.