ఓవైపు కరోనా, మరోవైపు అభిమానులు లేకుండా ఆడడం లాంటి కారణాలతో టోక్యో ఒలింపిక్స్ ఆడేది అనుమానమే అని ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ ఇంతకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ అనుమానాల్ని పక్కనపెడుతూ.. తాను ఒలింపిక్స్‌కు బయలుదేరుతున్నానని ఈ సెర్బియన్ దిగ్గజం అనౌన్స్ చేశాడు.
ఈ మేరకు తన ట్విటర్‌లో ఒక ట్వీట్ చేసిన 34 ఏళ్ల జొకోవిచ్.. టోక్యోకు వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నానని, ఒలింపిక్స్‌కు వెళ్తున్న సెర్బియన్ టీంలో తాను ఉన్నందుకు గర్వంగా ఉందని ట్వీట్‌లో తెలిపాడు. అంతేకాదు తన చిన్నారి స్నేహం కౌజిరౌను నిరుత్సాహపర్చడం తనకు ఇష్టం లేదంటూ పేర్కొంటూ ఆ చిన్నారి 6వ పుట్టినరోజు శుభాకాంక్షలు వీడియో సందేశం ద్వారా తెలియజేశా.
ఇదిలా ఉంటే ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి జోరు మీదున్న జొకోవిచ్.. ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శనతో రాణించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక తన కెరీర్‌లో 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో తొలిసారి పాల్గొన్న జొకోవిచ్.. ఆ దఫా కాంస్యం గెలిచాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పోరులో ఓడిపోగా… 2016 రియో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు.