అమరజీవికి అపూర్వ నివాళి.. రాజధానిలో కొలువుదీరిన ‘త్యాగ ప్రతీక’!

అమరావతి, మార్చి 15,2026 : తెలుగు జాతి ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటిచెప్పేందుకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మృతిని చిరస్థాయిగా నిలిపేలా రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది.

శాఖమూరు లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ (త్యాగ ప్రతీక) భారీ కాంస్య విగ్రహాన్ని మార్చి 16న (సోమవారం) ఘనంగా ఆవిష్కరించ నున్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈ వేడుకను నిర్వహించ నున్నారు.

58 రోజుల దీక్ష.. 58 అడుగుల విగ్రహం..

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు గారు చేపట్టిన 58 రోజుల చారిత్రాత్మక నిరాహార దీక్షకు గుర్తుగా, ఈ విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో రూపొందించడం విశేషం.

అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేవలం ఆరు నెలల రికార్డు కాలంలోనే ఈ విగ్రహ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు.

స్ఫూర్తి వనం.. స్మృతి కేంద్రం..

రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన ‘స్మృతి వనం’ను తీర్చిదిద్దారు. తెలుగు వారి పోరాట పటిమను, స్వాభిమానాన్ని ప్రతిబింబించేలా ఈ పార్కును స్ఫూర్తి కేంద్రంగా మలిచారు.

రేపు ఉదయం 10 గంటలకు జరిగే ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

ముఖ్య అతిథులుగా సీఎం, డిప్యూటీ సీఎం..


ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొననున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడికి నివాళిగా జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టానికి తెలుగు ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డూండి రాకేశ్ పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ఈ ‘త్యాగ ప్రతీక’ మరో కీలక మైలురాయిగా నిలవనుంది.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *