జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇటీవల లోయలోని సామాన్య ప్రజానీకంపై దాడులు జరిగిన సంఘటన తెలిసిందే. అయితే ఆ దుశ్చర్యలకు పాల్పడ్డ ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టడంతో.. అక్కడి ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ దుర్ఘటనలు మర్చిపోతుండగా.. బుధవారం నాడు మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని నవకాడల్ ప్రాంతంలో రవూఫ్ అహ్మద్ అనే పౌరుడు తన ఇంటి సమీపంలో ఉండగా.. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ రవూఫ్‌ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. ప్రాణాలు విడిచాడు.
ఇక మరో ఘటనలో అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహరా ప్రాంతంలో మొహమ్మద్ అష్రఫ్ అనే ఏఎస్‌ఐపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ ఏఎస్‌ఐని శ్రీనగర్‌లోని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ సదరు పోలీస్ అధికారి తుదిశ్వాస విడిచారు.