గుర్తుతెలియని దుండగులు మిరాజ్ ఫైటర్ జెట్ టైరును దొంగతనం చేయడం యూపీలో కలకలం రేపింది. ఈ ఘటన నవంబర్ 27వ తేదీన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లక్నోలోని బక్షి-కా-తలాబ్ ఎయిర్‌బేస్ నుంచి జోద్‌పూర్ ఎయిర్‌బేస్‌కు ట్రక్కులో తరలిస్తుండగా ఈ చోరీ జరిగింది. టక్ర్కు డ్రైవర్ హేమ్ సింగ్ రావత్ ట్రక్కులో మిరాజ్ ఫైటర్‌ను తీసుకువస్తుండగా.. షహీద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదే సమయంలో స్కార్పియో వాహనంలో వెళ్తున్న దుండగులు.. టైరుకు కట్టేందుకు ఉపయోగించే పట్టీని పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో చోరీ జరిగిందని డ్రైవర్ తెలిపారు. విషయాన్ని గమనించిన వెంటనే ట్రక్కు డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఆశియానా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుని చర్యలు తీసుకుంటామని డీసీపీ ఈస్ట్ అమిత్ కుమార్ తెలిపారు.