ఆఫ్ఘన్‌లో వరుస బాంబు పేలుళ్లు అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాలిబన్లు ఆఫ్ఘన్‌పై పట్టుసాధించి.. పరిపాలిస్తున్నప్పటి నుంచి ఈ ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా శుక్రవారం నాడు జరిగిన పేలుళ్లలో ముగ్గురు మృతి చెందగా.. దాదాపు 35 మంది గాయపడ్డారు. ఈ ఘటన నంగర్‌హర్ ప్రావిన్స్ ట్రైలీ పట్టణంలోని ఓ మసీదులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు పదుల సంఖ్యలో గాయపడ్డారని తాలిబన్ అధికారి ఒకరు ప్రకటించారు. అయితే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు తాలిబన్ అధికారుల నుంచి మాత్రం మృతులకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా, మసీదు లోపల బాంబులను అమర్చి పేల్చి ఉంటారని.. ఈ ఘటనలో మసీదుకు చెందిన ఇమామ్ కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది.
అయితే వరుసగా జరుగుతున్న ఈ ఘటనలన్నీ షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని అవుతున్నట్లు తెలుస్తోంది. ఐఎస్ఐఎస్‌కు అనుబంధంగా ఉన్న ఐఎస్‌ఐఎల్ ఉగ్రసంస్థ ఇటీవల ఖోరాసన్ ప్రావిన్స్‌లో అనేక దాడులు జరిపింది. ముఖ్యంగా శుక్రవారం నాడు షియా ముస్లింలు ఎక్కువగా హాజరయ్యే మసీదులను టార్గెట్‌గా ఈ బాంబు పేలుళ్లు జరుపుతుండటం కలకలం రేపుతోంది. కాగా, తాజాగా జరిగిన పేలుడుకు ఇప్పటి వరకూ ఏ ఉగ్రసంస్థ కూడా బాధ్యత వహించలేదు.