సిద్దిపేట జిల్ల కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం నుంచి మీడియా ఛానెల్స్‌లో.. సోషల్ మీడియాలో ఈ విషయంపై తెగచర్చజరిగింది. ఎట్టకేలకు ఈ విషయాన్ని నిజం చేస్తూ.. వెంకట్రామిరెడ్డి తన ఐఏఎస్ పదవి నుంచి స్వచ్ఛంద విరమణ చేశారు. రాజీనామా లేఖను తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు అందజేశారు. దీంతో వెంకట్రామిరెడ్డి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించి, ఉత్తర్వులు జారీ చేసింది. అయితే త్వరలోనే ఆయన టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారని.. అంతేగాక.. ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా కూడా ప్రకటించే అవకాశమున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కాగా, వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామం.1991లో గ్రూప్-1 ఆఫీసర్‌గా ప్రభుత్వ సర్వీసుల్లో చేరగా.. బందర్, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీవోగా పని చేశారు. అనంతరం మెదక్ జిల్లాలో డ్వామా పీడీగా చేశారు. హుడా సెక్రటరీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.