చార్మినార్ దగ్గర ఆగస్టు 14 న ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్


ఆజాది కా అమృత్ మహోత్సవ్-ఇండియా@75 వేడుకల్లో భాగంగా యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 ని నిర్వహించనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం ఆగస్టు 14న ఉదయం 7.30 నిమిషాలకు ఛార్మినార్ వద్ద ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గజారావ్ భూపాల్, డీసీపి-సౌత్ జోన్, విశిష్ట అతిథిగా శ్రీ డా. ఎన్. సురేంద్ర- ముఖ్య ప్రణాళికా అధికారి, అన్షుమన్ ప్రసాద్ దాస్- నెహ్రూ యువకేంద్ర సంఘటన్ రాష్ర్ణ సంచాలకులు, శ్రీ భిక్షం రెడ్డి- ఏసీపి, శ్రీ సుధాకర్-యువత, సంక్షేమ అధికారితో సహా పలువురు అధికారులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
అలాగే నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో సుమారు 5,700 మంది యువతీ యువకులతో హైదరాబాద్ లోని 75 కాలనీలలో పలు కార్యక్రమాలు జరుపనున్నారు.
గత సంవత్సరం కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరం రూపంలో ప్రజల సాధారణ జీవనశైలి మారింది. సామాజిక దూర నిబంధనలను అనుసరిస్తూ కూడా శారీరకంగా దృఢంగా చురుగ్గా ఉండడానికి ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ కు రూపకల్పన జరిగింది. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 కార్యక్రమాన్ని 2021 ఆగస్టు 13న యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభిస్తారు. దీని తరువాత ప్రతి వారం 75 జిల్లాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశంలోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి వర్చువల్ విధానంలో బిసిఎఫ్, సిఐఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్, రైల్వేస్, ఎన్‌వైకెఎస్, ఐటిబిపి, ఎన్‌ఎస్‌జి, ఎస్‌ఎస్‌బి వంటి సంస్థలు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటాయి. కార్యక్రమం ప్రారంభ సూచికగా 2021 ఆగస్టు 13 న 75 ప్రాంతాల్లో ప్రత్యక్ష కార్యక్రమాలను నిర్వహిస్తారు.
13 ఆగష్టు 2021 న ప్రారంభం అయ్యే ఈ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 అక్టోబర్ 2 వ తేదీన ముగుస్తుంది. ఊబకాయం, ఒత్తిడి నుంచి బయటపడడానికి ప్రజలు ప్రతి రోజు నడక, క్రీడలు లాంటి కార్యక్రమాల ద్వారా శారీరకంగా దృఢంగా ఉండాలని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ‘ప్రతి రోజు శారీరక దృఢత్వ సాధనకు 30 నిమిషాలు కేటాయించాలి’ అన్న పిలుపుతో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ను నివహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ తీసుకోవడం, జాతీయ గీతం ఆలపించడం, ఫ్రీడమ్ రన్ తో పాటు ఆయా వేదికల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. యువతలో స్ఫూర్తి కలిగించి వారి గ్రామాల్లో ఇలాంటి ఫ్రీడమ్ రన్‌లను నిర్వహించడానికి ప్రోత్సహిస్తారు. ప్రజలు తమ కార్యక్రమాలను ఫిట్ ఇండియా పోర్టల్ https://fitindia.gov.in, #Run4India మరియు #AzadikaAmritMahotsav హ్యాష్ ట్యాగ్స్ తో సోషల్ మీడియాలో ప్రసారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *