హైదరాబాద్ : మంత్రి మల్లారెడ్డి , పీసీపీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకరినొకరు రాయలేని భాషలో విమర్శించుకున్నారు కాదు కాదు తిట్టుకున్నారు. అయితే ఈ తిట్లు మాత్రం ఈనాటివి కావని వారిరువురినీ ఎరిగిన వారంటారు. పచ్చ పార్టీలోనే ఇద్దరి మధ్యా వైరం పురుడుపోసుకుని నేటికి దావానంలా విస్తరిస్తూనే ఉందంటారు. అసలు వైరానికి కారణమేమిటి? ఎక్కడ మొదలయ్యిందో చూద్దాం.
అవి 2014 లో తెలంగాణ ఏర్పడిన నాటి రోజులు రెండు రాష్ట్రాలతో పాటు పార్లమెంటుకు సాధారణ ఎన్నికలు ఒకేసారి వస్తున్నాయి.అప్పటికే కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులను ఒకింత ముందే అంచనా వేసుకుని అనేక అంతర్గత కారణాల వల్ల కూడా ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు . అప్పుడు బీజేపీ – టీడీపీ పొత్తుల కారణంగా పాలమూరు సీటు నాగం జనార్ధన్ రెడ్డికి వెళ్లడం ఖాయం అని మల్కాజిగిరి సీటు మీద కన్నేశాడు. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు కూడా చెప్పి మల్కాజిగిరి లో పోటీచేయడం కోసం రంగం సిద్దం చేసుకున్నాడు రేవంత్.
సరిగ్గా అప్పుడే విద్యాసంస్థల అధినేతగా ఉన్న మల్లారెడ్డికి రాజకీయాలకు రావాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా మల్కాజిగిరి మీద కన్నేసి నేరుగా చంద్రబాబును కలిసి చెప్పాల్సింది చెప్పి ఇవ్వాల్సింది ఇచ్చుకుని మల్కాజిగిరిని ఎంపీ స్థానం తనదే అనిపించుకున్నాడు కూడా. ఇంకేముంది ఎంసీ టిక్కెట్ నాదే అని అటు బీజేపీ దగ్గర నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది . విషయం బయటకు వచ్చేసింది రేవంత్ చెవిన కూడా పడింది. వెళ్లి చంద్రబాబును అడిగి కడిగేయాలనుకున్నా కూడా కుదరదని పార్టీ పరిస్థితి అర్ధం చేసుకుని తిరిగి కొడంగల్ రోడ్డెక్కేశాడు.
కానీ తెలంగాణలో అధికారంలోకి టీడీపీ ఎట్టాగు రాదని ముందే ఊహించిన రేవంత్ ఎంపీగా గెలిచి ఢిల్లీలో అడుగుపెట్టి జాతీయ రాజకీయాల ద్వారా తన భవిష్యత్ బాటలు వేసుకుందాం అంటే ఉరుములేని పిడుగులాగా మల్లారెడ్డి అడ్డం రావడంతో తలుచుకన్నప్రతీ సారి పాపం మల్లారెడ్డి గారే కదలాడుతారు.దీంతో అనుకున్న మార్గానికి అడ్డం వచ్చాడనే కోపం ప్రతీకారం మాత్రం మనసులో అట్లాగే కొనసాగుతోంది.
ఇద్దరూ కలిసి ఒక్కటే పార్టీలో కొనసాగినా కూడా అంటీ ముట్టనట్టే ఉన్నారు ఇద్దరు. తర్వాత వైరి పక్ష పార్టీలలో చేరడంతో ఇన్నాళ్లూ దాచుకున్న వైరం కాస్తా కట్టలు తెంచుకుని మాటలు దాటి బూతులకు చేరుకుని రాయలేని భాషలోకి చేరింది.