ఇటీవల మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ను చంపుతామంటూ వచ్చిన బెదిరింపు మెయిల్స్‌పై పోలీసులు దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మెయిల్స్ ఐఎస్ఎస్ కశ్మీర్ అని వస్తే అవి కశ్మీర్ నుంచి వచ్చాయని అనుమానాలు ఉన్నప్పటికీ.. ఢిల్లీ పోలీసులు చేసిన దర్యాప్తులో ఒకటి మాత్రం కశ్మీర్ నుంచి రాగా.. మరో మెయిల్ మాత్రం పాక్ నుంచి వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. కరాచీలోని సింధ్ యూనివర్సిటీ నుంచి మెయిల్ వచ్చిందని.. గంభీర్‌కు మెయిల్ పంపించిన అతడి పేరు షాహీద్ హమీద్ అని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
కాగా, గంభీర్‌ను హతమార్చుతామని.. మంగళవారం ఒకటి.. బుధవారం మరో మెయిల్ రావడంతో వెంటనే ఆయన ఢిల్లీ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. తొలుత ఆయన నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయనకు వచ్చిన మెయిల్స్ పాక్ నుంచి ఒకటి, కశ్మీర్ నుంచి మరొకటి వచ్చిందని తేలింది. మొత్తానికి ఉగ్రవాద చర్యలతో పాటు.. కశ్మీర్‌లో అలజడి సృష్టించే చర్యలన్నీ పాక్ కేంద్రగానే సాగుతున్నట్లు మరోసారి రుజువైంది.