ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ మొదలైంది. మరికొద్ది నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పావులు కదుపుతుంటే.. కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాయ్‌బరరేలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే ఆదితి సింగ్ బుధవారం నాడు బీజేపీ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమె గత కొంత కాలంగా పార్టీ అగ్రనాయకత్వంలో విభేదిస్తున్నారు. తొలిసారిగా ఆమె 2017లో యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె తండ్రి దివంగత అఖిలేష్ సింగ్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే రాయ్‌బరేలి స్థానంలో ఉన్న ఎమ్మెల్యేనే బీజేపీ గూటికి చేరుతుండటంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.