తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను భగవంత్ ఖుబా ప్రస్తావిస్తూ ఇవి నిరాధార ఆరోపణలు, తెలంగాణకు అవసరమైనన్ని నిధులు ఇచ్చేందుకు నరేంద్ర మోదీ జీ, అమిత్ షా జీ సిద్ధంగా ఉన్నారు. ఆ నిధులను సక్రమంగా వినియోగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నేనొక సాధారణ కార్యకర్తను బూత్ స్థాయి కార్యకర్తగా నా రాజకీయ జీవితం మొదలైంది, బీజేపీ నాయకత్వం నాకు రెండు సార్లు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించింది. శ్రీ నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఏకంగా కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం లభించింది. నాలాంటి సామాన్య కార్యకర్తకు కేంద్రమంత్రి పదవి దక్కడం అనేది ఒక్క బీజేపీతోనే సాధ్యం. తనకు ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు.
నరేంద్రం మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివ్రుద్ది, సంక్షేమ కార్యక్రమాలను అట్టడుగుస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజల ఆదరణ పొందగలిగితే…రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. బండి సంజయ్ అధ్యక్షతన తెలంగాణలో బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోందన్నారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక ఎన్నికల్లో సంజయ్, పార్టీ నేతల కృషివల్ల బీజేపీ సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల మాదిరిగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కష్టపడి పనిచేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.