భారత ప్రధాని నినాదమైన వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ ఎన్జీవో సంస్థ స్పూర్తిగా తీసుకుని.. మరుగునపడ్డ దేశీవాళీ పటాకుల తయారీ విధానాన్ని ముందుకు తీసుకువచ్చింది. దాదాపు నాలుగు శతాబ్ధాల క్రితం మట్టితో తయారు చేసే కోతీస్ పటాకులను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. పూర్తిగా ఇది దేశీవాళి బాణాసంచా అని ప్రముఖ్ పరివార్ ఫౌండేషన్ పేర్కొంది. ఇవి కాల్చడం ద్వారా పిల్లకు కూడా ఎలాంటి హానీకలగదని.. అందరూ వీటిని కాల్చవచ్చంటూ పేర్కొన్నారు. దీని ద్వారా తయారీదారులకు ఉపాధి కల్గించడంతో పాటు.. చైనీస్ క్రాకర్స్‌కు కూడా బ్రేకులు వేయవచ్చంటూ ఎన్జీవో అధ్యక్షుడు నితల్ గాంధీ పేర్కొన్నారు.
వడోదరా జిల్లాలోని ఫతేపూర్ కుమ్హరివాడలో ఈ పటాకులు గతంలో తయారుచేసేవారు. దాదాపు ఇరవై ఏళ్ల నుంచి వీటిని తయారు చేయడం ఆపేశారు. మార్కెట్‌లో చైనా బాంబుల అమ్మకం పెరగడంతో తమకు లాభాలు రాకపోవడంతో తయారీని ఆపేశామని తయారీదారులు ఎన్జీవో సంస్థకు తెలిపారు. అయితే ఈ పటాకుల తయారీని.. గమనించిన సంస్థ వీరికి అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో తిరిగి తయారీని ప్రారంభించారు. 400 ఏళ్ల క్రితం మట్టితో తయారు చేసిన పద్ధతితో కోతీస్ అనే పటాకులను తయారుచేశారు. ఇది పూర్తిగా మట్టితోనే తయారు చేస్తారు. వీటిలో పేపర్‌తో పాటు.. వెదురుతో తయారు చేసిన చక్రీ అనే పదార్ధం ఉంటుంది. ఎన్జీవో సంస్థ సహకారంతో ఈ సారి లక్షకు పైగా కోతీస్ బాంబులను తయారు చేశామని తయారీదారుడైన రామన్ ప్రజాపతి తెలిపాడు. ఇందుకోసం రెండు ట్రాక్టర్ల మట్టిని ఉపయోగించినట్లు పేర్కొన్నాడు. 20 ఏళ్ల తర్వాత వీటిని తయారుచేసి ఈ పండుగకు మంచిగా సంపాదించుకున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు కారణం ప్రముఖ్ పరివార్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు నితల్ గాంధీనే అంటూ తయారీదారులు చెప్పుకొచ్చారు.