హైదరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికలో అభ్యర్ధి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జనలు పడుతోంది. గత 40 సంవత్సరాలుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన చరిత్ర లేదు. ఇప్పుడు కూడా ఉన్న కౌశిక్ రెడ్డి అధికార పార్టీలోకి జంప్ అయ్యాడు . ఇక పాత తరంనేతలు కూడా అక్కడ పెద్దగా లేరు. దీంతో మాజీ మంత్రి కొండా సురేఖను హుజూరాబాద్ నుంచి పోటీ చేయించాలని పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రణాళికలు వేస్తున్నారు.
పరకాల నుంచి వరంగల్ తూర్పు నుంచి గతంలో ఎమ్మెల్యేగా , మంత్రిగా కూడా పనిచేశారు కొండా సురేఖ. ఈ రెండు నియోజకవర్గాలు కూడా హుజూరాబాద్ తో కలిసి ఉంటాయి. 2008 హన్మకొం పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన అనుభవం ఉంది కొండా సురేఖకి. అప్పుడు కమలాపూర్ అసెంబ్లీ హన్మకొండ పార్లమెంట్ పరిధిలోనే ఉండేది కూడా . ఇక పాత వరంగల్ లోనూ చుట్టు పక్కల కూడా కొండా దంపతులకు సొంతంగా అభిమానులు, క్యాడర్ కూడా ఏర్పరచుకున్నారు. అదే విధంగా కొండా సురేఖ పద్మశాలి ఆమె భర్త మున్నూరుకాపు కులానికి చెందిన వారు కావడం ఆ రెండు సామాజిక వర్గాలు కూడా హుజూరాబాద్ లో యాబై వేలకు పైచిలుకు వోటర్లు ఉండటంతో వారిని ఆకర్షించవచ్చని, సహజంగా కాంగ్రెస్ పార్టీకి ఉండే దూకుడు , కొండా దంపతులకు ఉండే ఆర్ధిక వనరులు , టీఆర్ఎస్ పార్టీలో కొండా దంపతులు అవమానం జరిగి వారు కూడా బయటికి వచ్చారనే సెంటిమెంట్ కూడా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
అయితే పక్క నియోజకవర్గంలో పోటీ చేయడం ద్వారా ఇటు పరకాల, అటు వరంగల్ తూర్పు ప్రజలకు దూరమయ్యే ప్రమాదముందని సురేఖ- మురళి దంపతులు ఆలోచిస్తున్నట్టు సమాచారం. 2014, వరంగల్ లో పోటీ చేసి గెలిచినా కూడా సొంత నియోజకవర్గం పరకాల క్యాడర్ పూర్తిగా చెల్లాచెదురయ్యి, మళ్లీ కొండా పరకాల రాడనే ప్రచారం వల్ల పట్టు కోల్పాయని వారు భావిస్తున్నారు. ఇప్పుడు పార్టీ కోసం హుజూరాబాద్ పోటీ చేస్తే పరకాల, వరంగల్ నియోజవర్గాల్లో కూడా తమ క్యాడర్ కోల్పోతామని వారి ఆలోచనగా ఉంది. కానీ హుజూరాబాద్ లో పోటీ చేస్తే పరకాల, వరంగల్ తూర్పు, హుజూరాబాద్ ఎమ్మెల్యే టిక్కెట్లతో పాటు ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నట్టు ఇంతకన్నా బంపర్ ఆఫర్ పార్టీలో ఏముంటుందని రేవంత్ చెప్పడంతో ఇప్పుడు హుజూరాబాద్ పోటీ చేసే విషయంలో కొండా దంపతులు డైలామా లో ఉన్నట్టు సమాచారం.
ఇప్పటికే బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ పాదయాత్రలు, సభల ద్వారా ప్రజల్లో విస్తృతంగా తిరుగుతుండటం, అధికార టీఆర్ఎస్ పార్టీ కూడాగెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అభ్యర్ధిగా నిర్ణయించడం, ప్రచారం చేస్తుండంతో వెంటనే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధిని ప్రకటించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మరి రేవంత్ ఒప్పిస్తాడా కొండా సురేఖ ధైర్యం చేస్తుందా చూడాలి .