బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రపై.. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ చేపట్టే పాదయాత్ర చరిత్రలో నిలిచిపోవడం ఖాయమన్నారు. తొలిదశ పాదయాత్ర విజయవంతం ఖావడంతో.. రాష్ట్రంలో బీజేపీ మరితం బలపడిందన్నారు. పాదయాత్ర పరిణామాలు కూడా హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు కారణమైందన్నారు. టీఆర్ఎస్ పార్టీ నియంత, కుటుంబ, అవినీతి పాలనకు చరమగీతం పాడి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నదే ‘ప్రజా సంగ్రామ యాత్ర’ అసలు లక్ష్యమని స్పష్టం చేశారు. బుధవారం నాడు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మలిదశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మలిదశ పాదయాత్ర విజయవంతం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తొలిదశ పాదయాత్రలో పాల్గొన్న పలువురు నేతలు పలు సూచనలిచ్చారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిన పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి.. నవంబర్ 21 నుండి జనవరి 10 వరకు మలిదశ పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో ఈసీని కలిసి పాదయాత్రకు అనుమతి కోరినట్లు తెలిపారు. ఈ మలిదశ పాదయాత్రలో సగటున రోజుకు 10 నుండి 12 కి.మీల చొప్పున ప్రతిరోజు పాదయాత్ర కొనసాగుతుందని.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పాదయాత్ర జరిపేలా ప్లాన్‌లు వేస్తున్నట్లు పేర్కొన్నారు. తొలిదశ పాదయాత్ర సక్సెస్‌తోనే సీఎం కేసీఆర్‌కు ఝలక్ ఇవ్వడంతోపాటుగా.. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తి బీజేపీయేనని ప్రజలకు సంకేతాలు పంపగలిగామన్నారు. ఇక మలిదశ పాదయాత్రను కూడా పక్కా ప్లాన్‌తో ముందుకు తీసుకెళితే చక్కటి ఫలితాలు వస్తాయన్నారు
కాగా, బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్‌లో తరుణ్ చుగ్‌తో పాటుగా పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు జి.ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శులు ప్రకాశ్ రెడ్డి, జయశ్రీ, ఉమారాణి, అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, పాదయాత్ర సహ ప్రముఖ్ లు వీరేందర్ గౌడ్, లంకల దీపక్ రెడ్డి, కుమ్మరి శంకర్ తదితరులు హాజరయ్యారు.