హుజురాబాద్ బైపోల్ తీర్పుతో సీఎం కేసీఆర్‌కు దిమ్మతిరిగిందంటూ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఉదయం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. అమరులకు నివాళులు అర్పించేందుకు గన్‌పార్క్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో అమరులకు నివాళులర్పించిన తరువాత.. మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్‌లో తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్ రూ.600 కోట్లు ఖర్చుపెట్టారంటూ ఆరోపించారు. ప్రస్తుతం ఉద్యోమ ద్రోహులకు పదవులిస్తూ.. ఉద్యమకారులను అవమానపరిచే కార్యక్రమం పెట్టుకున్నారని.. త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. 2023లో రాష్ట్రంలో కాషాయజెండా ఎగురుతుందని.. బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ గెలుపు ఆరంభం మాత్రమేనని.. 2023కు ముందే ఎన్నికలు రావొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసలు ధర్నా చౌక్ వద్దన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు అక్కడే ధర్నా చేస్తానంటున్నారని.. కేసీఆర్ నియంతృత్వ, అవినీతి పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలపై ప్రేముంటే వెంటనే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.