దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ భయం ఆందోళన కల్గిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. అవసరమున్న చోట కర్ఫ్యూ, లాక్‌డౌన్ పెట్టొచ్చన్న సంకేతాలను కూడా ఇచ్చింది. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్‌కర్ఫ్యూ దిశగా అడుగులు వేస్తున్నాయి. గుజరాత్ అయితే 8 నగరాల్లో నైట్‌కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీచేసింది. అయితే ఇప్పటి వరకూ కొందరు మాత్రం ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ డ్రైవ్‌లపై ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం ప్రజలంతా వ్యాక్సిన్ వేసుకోవాలన్న ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ.. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోని వారిని జనవరి 1వ తేదీ నుంచి బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించబోమన్నారు. వివాహాలు, హోటళ్లు, బ్యాంకులు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లోకి కూడా అనుమతించమంటూ ప్రకటించారు. అంతేకాదు.. వ్యాక్సిన్లు తీసుకోని వారు బస్సు ప్రయాణాలు కూడా చేయడానికి వీళ్లేదన్నారు.