కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాదు.. ఎంతో మంది ఉద్యోగాలను కూడా కోల్పోయి దిక్కుతోచని స్థితికి చేరుకుని.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ క్రమంలో మోదీ సర్కార్ దేశ ప్రజలకు తీపి కబురు అందజేసింది. లాక్డౌన్ మొదలుకున్నప్పటి నుంచి దేశంలోని పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో ఉచితంగా రేషన్ సరుకులను అందజేస్తూ వస్తున్నారు. అయితే ఈ ఉచిత సరుకులు ఈ నవంబర్ వరకు మాత్రమే అందజేస్తామని తొలుత ప్రకటించింది. అయితే ప్రస్తుతం దానిని వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడగిస్తున్నట్లు బుధవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద అర్హత ఉన్న 80 కోట్ల మందికి ఒక్కొక్కరికి 5 కిలోల చోప్పున ఆహార ధాన్యాలను (బియ్యం లేదా గోధుమలు) ఉచితంగా సరఫరా చేయనున్నారు. కాగా, కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో లాక్డౌన్ విధించినప్పుడు మూడు నెలలపాటు రూ.1500/- కూడా అందించింది.