దేశంలో కరోనా మహమ్మారికి బ్రేకులు వేసేందుకు అన్ని రంగాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు నూరు శాతం వ్యాక్సినేషన్ సాధించాలనే టార్గెట్‌తో పలు సంస్థల కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పోరేషన్ వినూత్న నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేసుకోకుండా దూరంగా ఉంటున్న వారిని వ్యాక్సిన్ వేసుకునేలా చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు వారికి వ్యాక్సిన్‌కు శాలరీకి లింక్ పెట్టారు. వ్యాక్సిన్ వేసుకోని సిబ్బందికి జీతం ఇవ్వమంటూ స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు కేవలం సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకుని.. రెండో డోస్ తీసుకోని వారికి జీతాలు చెల్లించేది లేదంటూ థానే మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు ప్రత్యేక సమావేశం పెట్టుకుని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. మున్సిపల్ కార్పోరేషన్ ఉద్యోగులంతా సంబంధిత కార్యాలయాల్లో వారి వారి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను సమర్పించాలంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నెలాఖరులోగా నగరంలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రోజు స్పెషల్ డ్రైవ్స్ పెట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేస్తామంటూ మేయర్ నరేష్ మస్కే తెలిపారు.