రంగారెడ్డి : బీజేపీని చూసి సీఎం కేసీఆర్ కు వణుకు పుడుతోందని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఏడవ రోజు పాదయాత్ర వికారాబాద్ జిల్లా చిట్టెంపల్లి నుంచి ప్రారంభమయ్యింది. కండ్లపల్లి, మన్నెగూడ మీదుగా వికారాబాద్ సమీపంలోని సాయి డెంటల్ కాలేజీ వరకు సాగింది. మార్గమధ్యలో వివిధ గ్రామాల ప్రజల సమస్యలు వింటూ , ప్రజల కష్టాలు తెలుసుకుంటూ యాత్ర సాగింది. రైతులు, గొర్ల కాపరులు , గ్రామాలు ప్రజలు తమ తమ గ్రామాల్లో ఉన్న సమస్యలను బండి సంజయ్ తో పంచుకున్నారు.

ఏడవ రోజు జాతీయ, రాష్ట్ర నాయకులు డీకే అరుణ, కపిలవాయి దిలీప్ , కూన శ్రీశైలం తో పాటు ఇతర నాయకులు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, ప్రజలు వెంట నడుస్తూ పాదయాత్రలో పాలుపంచుకున్నారు. రేపు జరిగే వికారాబాద్ పాదయాత్రలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొననున్నారు.

ఈ నెల పదిన వినాయకచవితి సందర్భంగా పాదయాత్రకు విరామం ఇస్తున్నట్టు యాత్రా ప్రముఖ్ మనోహర్ రెడ్డి వెల్లడించారు. అయితే రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ మాత్రం ఆందోల్ నియోజకర్గంలోనే బస చేసిన ప్రాంతంలో ఉంటున్నట్టు తెలిపారు .
