హుజురాబాద్ లో కేసీఆర్ మొహం చెల్లకే ప్రచారం చేయడంలేదు – బండి సంజయ్

అబద్దాల్లో కేసీఆర్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే
-హుజూరాబాద్ లో ముఖం చెల్లకనే సిగ్గులేకుండా ఈసీపై కేసీఆర్ నిందలేస్తున్నరు
-కోవిడ్ ఉందంటూ ఎన్నికలు వాయిదా వేయాలని లేఖ రాసింది సీఎస్ కాదా?
-దళిత రత్నాలకు అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వలేదు?
-కోర్టులో కేసు వేయించి దళిత బంధు రాకుండా కేసీఆర్ కుట్ర చేస్తుండు
-దళిత బంధుపై హుజూరాబాద్ నుండే యుద్దం ఆరంభిస్తాం
• టీఆర్ఎస్ ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. అబద్దాలాడే వారికి అవార్డు ఇవ్వాల్సి వస్తే కేసీఆర్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. గతంలో తన ముఖం చూసి ఓటేస్తారని చెప్పిన కేసీఆర్ కు హుజూరాబాద్ లో ముఖం చెల్లడం లేదని, అందుకే ఇక్కడకు రాకుండా సభ పెట్టుకోనీయకుండా ఈసీ అడ్డుకుంటోందంటూ రాజ్యాంగబద్దమైన ఎన్నికల సంఘంపై నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కోవిడ్ ప్రభావం ఉన్నందున ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఈసీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా లేఖ పంపిందే కేసీఆర్ అని మండిపడ్డారు. అయినా సిగ్గు లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించడంలో ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకున్న జాతీయ ఎన్నికల సంఘం పై నిందలు మోపడం సిగ్గుచేటన్నారు. దళిత రత్నాలంటూ దళితులను మరోసారి కేసీఆర్ మోసం చేసేందుకు సిద్దమయ్యారన్నారు. ‘సిగ్గుండాలి సీఎంకు… ఇప్పటికే దళితుడికి సీఎం ఇవ్వకుండా మోసం చేసిండు. ఉప ముఖ్యమంత్రి పదవి నుండి దించేసి అవమానించినవ్. 20 ఏళ్లుగా ఫెవికాల్ పెట్టుకుని టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ కు దళిత రత్నాలపట్ల నిజంగా ప్రేమ ఉంటే కనీసం అధ్యక్ష పదవి అయినా ఎందుకు ఇవ్వలేదు.’’అని ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం బేతిగల్, చల్లూరు గ్రామాల్లో బండి సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర నాయకులు జెనవాడ సంగప్ప, దరువు ఎల్లన్న, జిల్లా పార్టీ అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్న ఈ ప్రచారంలో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
• అబద్దాల్లో కేసీఆర్ కు ఆస్కార్ ను మించిన అవార్డు ఇవ్వాల్సిందే. ఈరోజు సీఎం కేసీఆర్ ప్లీనరీ సమావేశం పెట్టుకుని పచ్చి అబద్దాలు మాట్లాడిండు. ఇదే మీటింగ్ రెండు నెలల ముందే పెట్టి ఉంటే ఈయన ఆడే అబద్దాలకు ఆస్కార్ అవార్డు వచ్చేది. ఇఫ్పటికైనా మించిందేమీ లేదు. అబద్దాలా డే వాళ్లకు అవార్డు ఇవ్వాల్సి వస్తే కేసీఆర్ కు అవార్డు ఇవ్వాల్సిందే.
• హుజూరాబాద్ లో ప్రచారానికి వచ్చే ముఖం చెల్లక ఎన్నికల సంఘం సభలు పెట్టకుండా చేసిందంటూ కేసీఆర్ ఈసీని బద్నాం చేస్తుండు. ప్రపంచంలోనే భారత ఎన్నికల సంఘానికి నెంబర్ వన్ అని పేరుంది. బెంగాల్ ఎలక్షన్ లో ప్రధానమంత్రికి ఒకటే రూల్. ఆ రూల్స్ వల్ల అమిత్ షా గారి మీటింగ్ కూడా రద్దు చేసుకున్నం. నువ్వో పెద్ద పోటుగాడివంట. నీకోసం ఎలక్షన్ కమీషన్ స్పెషల్ రూల్ పెట్టాలట….
• ‘‘తెలంగాణలో కోవిడ్ ఉంది. ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీకి సెప్టెంబర్ 4న సీఎస్ తో లేఖ రాయించింది నువ్వు (కేసీఆర్) కాదా? అసలు హుజూరాబాద్ లో ఓటడిగే ముఖం లేదు. ఇక్కడికొస్తే తెలంగాణ ఉద్యమంలో నీతోపాటు 20 ఏండ్లు పనిచేసిన ఈటల రాజేందరన్నను ఎందుకు అవమానంగా పంపించావో చెప్పాలంటూ జనం నిలదీస్తరని భయం వేసి ముఖం చెల్లడం లేదు. ఉద్యోగాలెందుకు ఇవ్వడం లేదని తల్లిదండ్రులు అడుగుతరని రావడానికి ముఖం చెల్లడం లేదు. నిరుద్యోగ భ్రుతి ఎందుకు ఇవ్వడం లేదని ముక్కుపిండి అడుగుతరని రావడానికి ధైర్యం చాలడం లేదు. ముఖం బాలేదని అద్దం పగట్టుకొట్టుకున్నడట నీలాంటోడు. నీకు చేతగాక ఈసీపై నిందలేస్తావా? సీఎం స్థాయిలో ఉండి రాజ్యాంగబద్ద సంస్థపై అట్ల మాట్లాడతావా…సిగ్గుండాలి.
• రాబందు నోట మళ్లా దళిత రత్నాలనే మాటలిన్పిస్తున్నయ్. నిజమే…తెలంగాణలో ఎంతోమంది దళిత రత్నాలున్నరు. మరి వాళ్లకు సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదు. 20 ఏళ్లుగా ఫెవికాల్ అంటిపెట్టకుని పార్టీ అధ్యక్ష పదవిలో ఎందుకు కొనసాగుతున్నవ్. నువ్వు పార్టీ పెట్టినప్పడి నుండి దళితులను మోసం చేస్తూనే ఉన్నవ్. డిప్యూటీ సీఎం పదవిచ్చి అవమానింగా తీసేసింది నిజం కాదా?
• హుజూరాబాద్ ప్రజలంతా దళిత బంధు పేరుతో మోసం చేసినవని అర్థం చేసుకున్నరు. అందుకే దళితరత్నాలంటూ…. ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తూ నటిస్తున్నవ్. ఎన్నిలైనంక దళిత బంధు అమలు చేస్తనని కొత్త డ్రామాలు మొదలుపెట్టిండు. అసలు ఇన్ని రోజులు డబ్బులు ఇవ్వకుండా ఎవడు ఆపిండు. ఆగస్టు 16న పథకాన్ని ప్రారంభించినా ఒక్కడికి కూడా ఎందుకు ఇవ్వలేదు? నీ చేతుల మీదుగా 16 మందికి చెక్కులిచ్చిన సెప్టెంబర్ 12న అకౌంట్లో డబ్బులేసినవ్. ఇప్పటిదాకా వాటిని వాడుకునే అవకాశం ఇవ్వకుండా ఎందుకు ఫ్రీజ్ చేసినవ్? అయినా ఎన్నికలైనంక డబ్బులిస్తనంటే నమ్మడానికి దళిత బిడ్డలేమైనా పిచ్చోళ్లు. నిజంగా జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత వరద బాధితులకు 10 వేల రూపాయలు ఇచ్చి ఉంటే మా దళిత బిడ్డలు నమ్ముతుండే. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు 50 వేల ఉద్యోగాలిస్తామని నీ కొడుకు చెప్పిండు కదా….అవి ఇచ్చి ఉంటే మా దళిత బిడ్డలు నమ్ముతుండే. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు పైసల్లేవుగానీ….1.70 లక్షల కోట్లు ఖర్చు చేస్తడట. చెప్పడానికైనా సిగ్గుండాలి.
• కేసీఆర్ గవర్నమెంట్ రాకముందు బొంబాయి-బొగ్గుబాయి-దుబాయి లెక్క మన బతుకులుండేనట…ఈయనొచ్చినంక ఉద్దరించిండంట. సిగ్గుండాలి చెప్పడానికి? పాలమూరు బిడ్డలు రోజూ బొంబాయికి పొట్ట చేతబట్టుకుని పోతనే ఉన్నరు. సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల నుండి వేల మంది బతుకుదెరువు కోసం దుబాయి పోతనే ఉన్నరు. నీ బిడ్డ, కొడుకేమో డబ్బులు దాచుకోవడానికి దుబాయి పోతున్నరు. బొగ్గుబాయిలను నాశనం చేసినవ్. 63 వేల మంది సింగరేణి కార్మికులుంటే అందులో 20 వేల మంది కొలువులు పీకేసి రోడ్డున పడేసినవ్.
• ఎవరైనా సరే…సాయం చేస్తే మర్చిపోరు. కానీ విశ్వాసం లేని మనిషి కేసీఆర్. తెలంగాణలో 12,769 గ్రామాల్లో రోడ్లు, కరెంటు, మౌలిక సదుపాయాలు, స్మశానవాటికల నిర్మాణం, రైతు వేదికల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, మొక్కల పెంపకం, ప్రక్రుతి వనాలు, డంప్ యార్డుల ఏర్పాటు వంటి వన్నీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చెయ్యబట్టే ఇయ్యాల సస్యశ్యామలంగా గ్రామాలున్నయట. వీటన్నింటినీ పైసలిచ్చిందెవరయ్యా? ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ఊరూరికి డబ్బులిస్తుంది నిజంకాదా? కనీసం మోదీ పేరును కూడా ప్రస్తావించకుండా నేనే అన్నీ చేసినని చెప్పుకుంటున్నవంటే నిన్నేమనాలి?
• టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందట. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యాలయాలను బ్రహ్మండంగా నిర్మించుకుంటడట. తెలంగాణలో ఉండటానికి ఇల్లు లేక లక్షల మంది పేదలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అల్లాడిపోతుండ్రు. ఇల్లు కట్టివ్వాలని లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఏండ్లు గడుస్తున్నా కనికరించిన నువ్వు…నీ పార్టీ నాయకులు ఊరేగడానికి మాత్రం బ్రహ్మండంగా పార్టీ కార్యాలయాలు నిర్మించుకుంటరా? సిగ్గుండాలి చెప్పడానికి.
• నేను చెప్పిన మాటలన్నీ నిజమైనయని, అన్నీ నెరవేర్చినట్లు కేసీఆర్ మళ్లీ గప్పాలు కొడుతుండు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నవ్? నిరుద్యోగ భ్రుతి అంటివి? దళితుడిని సీఎం చేస్తనంటివి? దళితులందరికీ మూడెకరాలు భూమి ఇస్తనంటివి? లక్ష ఉద్యోగాలిస్తనంటివి. మాట తప్పితే మెడ కోసుకుంటనంటివి. ఒక్క హామీ కూడా నెరవేర్చని నువ్వు మాట ఇస్తే మడమ తిప్పను. అన్నీ నిజం చేసినని గప్పాలు కొడుతవా? సిగ్గుండాలి…

• టీఆర్ఎస్ కు ఓటేయాలంటూ పోలీసులతో బెదిరించి భయపెడుతున్నరు. ప్రజలెవరూ భయపడకండి. స్వేచ్ఛగా ఓటేయండి. పువ్వు గుర్తుకు ఓటేసి కేసీఆర్ కు గుణపాఠం చెప్పండి. వచ్చేనెల 2న హుజూరాబాద్ ప్రజల దెబ్బకు టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలి. ప్రగతి భవన్ లో కేసీఆర్ కు ‘ట్రిపుల్ ఆర్’ సినిమా చూపిస్తం. వచ్చేనెల 2 తరువాత కేసీఆర్ దుకాణం బంద్ కావడం ఖాయం.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *