వర్షాకాలంలో పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఫ్లకార్డుల ప్రదర్శనలు చేపట్టారు. కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డితో పాటు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి.
ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉన్నప్పటికీ.. కేసీఆర్ సర్కార్ సరైన ఏర్పాట్లు చేయకుండా రైతుల్ని ఇబ్బందులకు గురిచేస్తోందంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. కేవలం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. బద్నాం చేసేందుకు కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనాల్సిందేనని.. అప్పటి వరకు తమ పోరాటం కొనసాగిస్తామని.. కేసీఆర్ ప్రభుత్వం దిగొచ్చేవరకు రైతుల వెంటే ఉంటామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.