తాము ఎవరితోనూ విభేదించమని, తమకెవరూ విరోధులు కారని, సమాజంలో సకారాత్మక పరివర్తన తీసుకురావడమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ లక్ష్యమని ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హొసబలే పేర్కొన్నారు. కర్ణాటకలోని ధార్వాడలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా ధార్వాడలో జరిగిన పాత్రికేయ సమావేశంలో అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశాల వివరాలను శ్రీ దత్తాత్రేయ హొసబలే వెల్లడించారు.
అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశాలు ఈసారి కర్ణాటకలోని ధార్వాడలో నిర్వహించుకున్నామని, ఈ సమావేశాలలో ఆర్.ఎస్.ఎస్ కార్యక్రమాల సమీక్ష, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించామని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది మార్చిలో అఖిల భారతీయ ప్రతినిధి సభ జరుగుతుందని, ఈ కార్యకారీ మండలి సమావేశం దీపావళి ముందు జరుగుతుందని ఆయన తెలిపారు. అందరూ భయపడ్డట్టుగా కరోనా థర్డ్ వేవ్ వచ్చి ఉంటే దానిని ఎదుర్కోవడానికి వీలుగా తాము 4 లక్షల మంది వాలంటీర్లను సిద్ధం చేశామని శ్రీ హొసబలే తెలిపారు. భగవంతుని దయవల్ల ఆ ముప్పు తప్పిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా 34 వేల స్థలాలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శాఖలు జరుగుతున్నాయని, అలాగే 12,780 స్థలాలలో సాప్తాహిక్ మిలన్ లు జరుగుతున్నాయని, 7900 స్థలాలలో సంఘమండలి, ఆ విధంగా మొత్తం సుమారు 55 వేల స్థలాలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయని శ్రీ దత్తాత్రేయ హొసబలే వెల్లడించారు.
ఒక్కొక్క చోట ఒకే స్థలంలో 4, 5 శాఖలు కూడా జరుగుతూ ఉంటాయని, అలా ఇంతకముందు చెప్పిన 34 వేల స్థలాలలో 54,382 శాఖలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దృష్ట్యా దేశం మొత్తం మీద 6,483 ఖండలు ఉండగా 5,683 ఖండలలో ఆర్.ఎస్.ఎస్ కార్యకలాపాలు నడుస్తున్నాయని, నాగాలాండ్, మిజోరాం, కాశ్మీర్ వంటి చోట్ల మాత్రమే సంఘ కార్యకలాపాలు ఇంకా మొదలు కాలేదని ఆయన తెలిపారు. దేశం మొత్తం మీద 32,687 మండలాలకు ఆర్.ఎస్.ఎస్ విస్తరించి ఉన్నదని ఆయన తెలిపారు.
సుమారు 560 జిల్లా కేంద్రాలలో 5 అంతకంటే ఎక్కువ శాఖలు నడుస్తున్నాయని, 84 జిల్లాలలో అన్ని మండలాలు శాఖాయుక్తమయ్యాయని దత్తాజీ తెలిపారు. ఇప్పటికే దేశంలోని 60 నుంచి 70 శాతం మండలాలకు తాము విస్తరించామని, 2024 మార్చి నాటికి దేశంలోని అన్ని మండలాలకూ సంఘ కార్యకలాపాలను విస్తరిస్తామని ఆయన తెలిపారు.
సంఘం ప్రారంభమై 2025 విజయదశమి నాటికి 100 సంవత్సరాలు పూర్తవనున్న సందర్భంగా కనీసం 2 సంవత్సరాల పాటు పూర్తి సమయం ఇవ్వగలిగిన కార్యకర్తలకు పిలుపునిస్తున్నామని, 2022 నుంచి 2025 వరకు ఈ విధంగా పూర్తి సమయ కార్యకర్తలుగా పని చేయడానికి ఎంతమంది ముందుకు వస్తారో 2022 మార్చి నాటికి తెలుస్తుందని వారు తెలిపారు. ఆ విధంగా ప్రతి ఖండకు ఒక పూర్తి సమయ కార్యకర్త చొప్పున దేశంలో సుమారు 6 వేల మంది పూర్తి సమయ కార్యకర్తలు పని చేయనున్నారని ఆయన వెల్లడించారు.
కోవిడ్ క్లిష్ట పరిస్థితుల కారణంగా పూర్తిస్థాయిలో శాఖా కార్యక్రమాలు కొనసాగకపోయినా దేశం మొత్తం మీద 1,05938 గురుపూజా ఉత్సవాలు జరిగాయని, అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత మహోత్సవాలను పురస్కరించుకుని స్వయంసేవకులు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర కేంద్రాలలో భరతమాత పూజా కార్యక్రమాలు, సాహిత్య వితరణ వంటివి చేశారని తెలిపారు.
అలాగే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని పెద్దగా గుర్తింపుకు నోచుకోక, మరుగున పడిపోయిన రాణి అబ్బక్క, నాచ్చియార్ వంటి వీరమాతలను, వీరులెందరినో దేశ ప్రజలకు గుర్తుచేసే, పరిచయం చేసే ప్రయత్నాన్ని ఈ సందర్భంగా తాము చేస్తున్నామని సాహిత్య వితరణ, ఫోటోల ప్రదర్శనలు, వివిధ చోట్ల సెమినార్లు, వెబినార్లు నిర్వహించడం ద్వారా తాము మరుగున పడిపోయిన దేశభక్తుల చరిత్రలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని వారు తెలిపారు.
భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచ చరిత్రలోనే విశిష్టమైనదని ఎందుకంటే ఇది అత్యంత సుదీర్ఘంగా జరిగిన పోరాటమని, ఈ పోరాటం దేశ ఏకాత్మతను చాటిందని ఆయన తెలిపారు. వివిధ ప్రాంతాలకు, భాషలకు చెందిన లాల్, బాల్, పాల్ లు అలాగే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు కలిసి ఒకే లక్ష్యం కోసం కలసి పని చేయడం, దేశం పట్ల వారికున్న సంవేదనను అందుకు ఉదాహరణగా ఆయన తెలిపారు. బెంగాల్ కు చెందిన సుభాష్ చంద్రబోస్ ను తమిళనాడులోని ప్రజలు కూడా తమవాడిగా, తమ నాయకుడిగా భావించడమే ఏకాత్మత అని, భారత స్వాతంత్ర్య పోరాటం భారతీయ ఏకాత్మతను ఘనంగా చాటిందని శ్రీ హొసబలే తెలిపారు.
స్వాతంత్ర్యాన్ని సాధించటమంటే కేవలం ఆంగ్లేయులను తరిమివేయడం మాత్రమే కాదని భారతీయ ఆత్మ జాగృతం కావాలని, భారతీయులలో ‘స్వ’ భావన జాగృతం కావాలని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశం యొక్క సర్వాంగీణ ఉన్నతికై కృషి చేస్తామని నేటి యువత సంకల్పం చేయాలని సంఘం యువతకు పిలుపునిస్తోందని దత్తాజీ పేర్కొన్నారు.
గురు తేజ్ బహదూర్ దేశధర్మాల కోసం ఆత్మ బలిదానం చేసి 400 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఆర్.ఎస్.ఎస్ శ్రీకారం చుట్టనున్నదని కూడా ఆయన తెలిపారు. భారతీయ సమాజం అస్పృశ్యత, దుర్వ్యసనాలు, భ్రూణ హత్యలు వంటి అవలక్షణాలను వదిలించుకోవాలని, అలాంటి సామాజిక పరివర్తన కోసం ఆర్ ఎస్ ఎస్ కృషి చేస్తున్నదని, అలాగే ధర్మ జాగరణ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసత, గ్రామీణ వికాసన్, కుటుంబ ప్రబోధన్ వంటి వివిధ కార్యక్రమాల ద్వారా సమాజంలో సామాజిక పరివర్తనకు సంఘం కృషి చేస్తున్నదని శ్రీ దత్తాత్రేయ తెలిపారు.
అలాగే శిక్ష – స్వాస్థ్య – స్వావలంబన్ (విద్య – ఆరోగ్యం – స్వావలంబన) లే లక్ష్యంగా తాము దేశవ్యాప్తంగా సేవాకార్యాన్ని నిర్వహిస్తున్నామని, సమాజంలో జాతి భేదాలు, అస్పృశ్యతల పేరుతో సామాజిక విభజనకు జరుగుతున్న ప్రయత్నాలను కూడా తిప్పికొట్టనున్నామని, రాబోయే 3,4 సంవత్సరాలలో దీనిపై దృష్టి పెట్టనున్నామని వారు తెలిపారు.
కరోనా కారణంగా గత రెండున్నర సంవత్సరాల కాలంలో విద్య, ఉద్యోగ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ఆ కారణంగా గ్రామీణ ప్రాంతాలలోని స్థానిక నైపుణ్యాలను గుర్తించి వాటి ద్వారా ఉపాధిని పొందే విధంగా ప్రజలను ప్రోత్సహించే ప్రయత్నం చేయనున్నామని, ఆ విధంగా ‘రోజ్ గార్ సృజన్’ పేరుతో పనిలేని వారికి పని కల్పించే ప్రయత్నం చేయనున్నామని వారు వెల్లడించారు.
హిందూ జనాభా బాగా తక్కువగా ఉన్న నాగాలాండ్, మిజోరం, కాశ్మీర్, లక్ష్యద్వీప్ వంటి ప్రాంతాలలో ఆర్.ఎస్.ఎస్ శాఖలు జరుగక పోయినా అక్కడ తమ సేవా కార్యకలాపాలు మాత్రం నిత్యం కొనసాగుతూనే ఉన్నాయని పాత్రికేయులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా దత్తాజీ తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా జనాభా నియంత్రణకు ఒకే విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉన్నదని, ఈ విషయమై 5,6 సంవత్సరాల క్రితమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ తీర్మానం చేసిందని మరో ప్రశ్నకు సమాధానంగా వారు తెలిపారు.
అలాగే పర్యావరణ పరిరక్షణ అనేది రోజువారీ జరగాల్సిన కార్యక్రమమని అయితే కొన్ని హిందూ పండగలప్పుడు మాత్రమే కొందరికి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గుర్తుకురావడం సరికాదని, ఇలాంటి విషయాలలో రాత్రికి రాత్రే మార్పు సాధ్యం కాదని, అకస్మాత్తుగా పండుగలను నిషేధించడం వలన వాటి మీద ఆధారపడ్డ అనేక మంది ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని, ఉపాధి కోల్పోతున్నారని, కనుక పండుగలను నిలుపుదల చేసే విషయంలో అన్ని వర్గాలతో చర్చించి, అందరి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకుని ఒక సకారాత్మకమైన ఆలోచనతో ఆ విషయంలో ముందుకు వెళ్లాల్సిన అవసరమున్నదని ఆయన వెల్లడించారు.
దేశంలో మతమార్పిడులు ఆగవలసిన అవసరమున్నదని, నిజానికి మతం మారిన వారు తాము హిందువుగానే చలామణి అవుతూ రెండు రకాల ప్రయోజనాలనూ అనుభవిస్తూ ఉన్నారని, సుమారు 20 రాష్ట్రాలలో ఇప్పటికే మత మార్పిడి నిరోధక చట్టాలు అమలవుతున్నాయని, గతంలో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో సైతం మత మార్పిడి నిరోధక బిల్లును ఆమోదించి అమలు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.