హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర తొలిదశ ముగిసింది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి నుంచి ప్రారంభం అయిన పాదయాత్ర హుస్నాబాద్ లో పూర్తయ్యింది. 36 రోజుల పాటు సాగిన పాదయాత్ర 438 కిలోమీటర్ల పాటు సాగింది. ఆరు పార్లమెంటు సెగ్మెంట్లలోని 19 శాసనసభా నియోజకవర్గాల గుండా పాదయాత్ర కొనసాగింది. వేలాది మంది కార్యకర్తలతో కలిసి ప్రతీ నిత్యం ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ భరోసా ఇచ్చుకుంటూ యాత్ర చేశారు బండి సంజయ్. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా ఓ జాతీయ నాయకుడు పాదయాత్రకు మద్దతు తెలిపారు. సెప్టెంబర్ 17 న నిర్మల్ లో తెలంగాణ విమోచన దినోత్సవం సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరయ్యి బీజేపీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు. బండి సంజయ్ పాదయాత్రను చూసి రాష్ట్రంలో సర్కారు భయపడుతోందని, పాదయాత్రకు వచ్చిన స్పందన చూస్తే వచ్చేది బీజేపీ సర్కారు అని అమిత్ షా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు .