కరోనా మహమ్మారి రూపాంతంరం చెందుతూ ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు భారత్‌ను కూడా అప్రమత్తం చేస్తోంది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన పలువురికి ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్రమత్తంగా ఉండాలని.. వీలైతే కర్ఫ్యూ, లాక్డౌన్ వంటి వాటి గురించి కూడా ఆలోచించాలని సూచనలు చేసింది. దీంతో గుజరాత్ ప్రభుత్వం ఒమిక్రాన్ భయంతో రాష్ట్రంలో నైట్కర్ప్యూను పలు నగరాల్లో విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్‌తో 11 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక రాబోయే రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రధానమైన ఎనిమిది నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధించింది. సోమవారం నాడు.. కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం రీవ్యూ నిర్వహించింది. ఈ క్రమంలోనే అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్ సహా ఎనిమిది నగరాల్లో నైట్ కర్ఫ్యూను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు ఈ నెల 31 వరకు ఉంటాయని పేర్కొంది. రాత్రి ఒంటి గంట ఉదయం 5 గంటల వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనున్నది.