టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరికి అవమానం జరిగిందంటూ ప్రెస్‌మీట్‌లో కన్నీరు కార్చడం చూసి ఆశ్చర్యపోయానంటూ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పడు.. నాడు 2017లో కాపు ఉద్యమం చేపడుతున్న సమయంలో పోలీసుల సహకారంతో తనను.. తన కుటుంబాన్ని భౌతికంగా, మానసికంగా ఎన్నో వేధింపులకు చంద్రబాబు పాల్పడ్డారంటూ గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు వల్ల తన కుటుంబానికి జరిగిన అవమానం మర్చిపోలేందని చెప్తూ.. చంద్రబాబుకు ముద్రగడ మంగళవారం రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు.
లేఖలో ప్రస్తావిస్తూ.. చంద్రబాబు కంటే కూడా తమ కుటుంబానికి ఎంతో చరిత్ర ఉందని.. తమ తాత పేరు కిర్లంపూడి మనసబు అని.. అయితే జిల్లా మునసబుగా వ్యవహరించేవారని పేర్కొన్నారు. ఇక తన తండ్రి పత్తిపాడు అసెంబ్లీ నుంచి రెండు సార్లు స్వతంత్ర్య అభ్యర్ధిగా పంపారని.. తాను 1978లో చంద్రబాబుతో కలిసి అసెంబ్లీలో అడుగుపెట్టానన్న విషయాన్ని లేఖలో తెలిపారు.
మీ కుమారుడు నారా లోకేష్ ఆదేశాలతో పోలీసులు నన్ను బూటు కాలితో తన్నారని.. నా భార్య, కుమారుడు, కోడల్ని బూతులు తిడుతూ లాఠీలతో కొట్టారని లేఖలో ఆరోపించారు. 14 రోజుల పాటుగా ఆస్పత్రి గదిలో నన్ను, నా భార్యను ఏ కారణంతో బంధించారని ప్రశ్నించారు. మీ రాక్షసానందం కోసం ఆస్పత్రిలో మా దంపతులను ఫోటోలు తీయించి చూసేవారని.. మీరు చేసిన హింసాత్మక అవమానాన్ని తట్టుకోలేక ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపామన్నారు. అణిచివేతతో తమ కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలన్నది మీ ప్రయత్నం కాదా? అంటూ లేఖలో ప్రశ్నల వర్షం కురిపించారు.
మా కుటుంబాన్ని అవమాన పరచిన మీ పతనం నా కళ్ళతో చూడాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్ననంటూ లేఖలో పేర్కొన్నారు.