పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణల విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్ ప్రదర్శనలో జిల్లా వాసులు మరో మారు సత్తా చాటినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్.ఎస్.సంగీత సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.గత మూడేళ్లుగా టి.ఎస్.ఐ.సి నిర్వహిస్తున్న వినూత్న ఆవిష్కరణల ప్రదర్శనలో ఈ మారు జిల్లాకు చెందిన 5గురు తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రంలోనే ఎక్కువ బహుమతులు గెలుచుకున్నట్టు పేర్కొన్నారు.జిల్లాలోని రామగిరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చందనాపూర్ కు చెందిన ఇరువురు విద్యార్థులు ఎం.సమత(10వ తరగతి-“వృద్ధులు&వికలాంగుల ఊతకర్ర”),కె.మధురిమలు(9వ తరగతి-‘కరోనా వైరస్ నిర్మూలణకు గాలిని శుద్ధి చేయు యంత్రం’) రూపొందించిన ఆవిష్కరణలు ఎంపిక కావడమే కాకుండా వరసగా మూడు సంవత్సరాలుగా ఆ పాఠశాలకు చెందిన విద్యార్థులు విజేతలై హ్యట్రిక్ సాధించారు.
గోదావరిఖనికి చెందిన యువ టెక్నోక్రాట్ బి.భగత్ ప్రశాంత్ తన ఉత్తమ ప్రదర్శన ద్వారా హ్యట్రిక్ సాధించడమే కాకుండా ఈ మారు పంపిన రెండు ఆవిష్కరణలు(‘గడ్డి తొలగించే యంత్రం’&”విత్తనాలను సులువుగా విత్తే సాధనం”)ఎంపిక కావడం విశేషంగా పేర్కొన వచ్చును.ఆవిష్కరణలు ప్రారంభమైన తొలి ఏడాది 2019లో బహుమతి పొందిన పల్లె శ్యాంసుందర్ ఈ సారి మరింత ఆకర్షణీయమైన రీతిలో తన ఆవిష్కరణ(“తక్కువ విద్యుత్ వినియోగం,తక్కువ నిర్వహణతో పూర్తిగా ఆటోమేటిక్ ఎగ్ ఇంక్యూబేటర్”)ను మెరుగుపరిచి విజేతగా నిలిచారు.
5 విభాగాలకు గాను ఐదింటిలో బహుమతులు గెలుపొంది జిల్లా వాసులు శభాష్ అనిపించుకున్నారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మరోమారు రాణించడం పట్ల జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ బి.జగన్మోహన్ రెడ్డి,ఇంటింటా ఇన్నోవేటర్ జిల్లా సమన్వయకర్త&డి.ఎస్.ఓ బి.రవినందన్ రావులు విద్యార్థులు,గైడ్ టీచర్ టి.సంపత్ కుమార్ లను అభినందించారు.