హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన భారత త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు శుక్రవారం నాడు నిర్వహించునున్నారు.బుధవారం నాడు తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ అమరుడైనట్లు భారత వాయుసేన ప్రకటించింది. కూనూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్‌తోపాటుగా మరో 11 మంది అమరులయ్యారని.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు ప్రకటించారు.
ఈ హెలికాప్టర్ ప్రమాదంపై ఆర్మీ కోర్టు నేతృత్వంలో విచారణకు ఆదేశించినట్టు భారత వాయుసేన మరో ప్రకటనలో తెలిపింది. ఊటీ సమీపంలోని నీలగిరి కొండల్లో వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ (డీఎస్‌ఎస్‌సీ)లో లెక్చర్ ఇచ్చేందుకు జనరల్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్, మరికొందరు ఆర్మీ ఉన్నతాధికారులు కలిసి భారత వాయుసేనకి చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌లో బయల్దేరారు. అయితే గమ్యస్థానానికి మరో పది నిమిషాల్లో చేరుతారనుకున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ విషాద ఘటన సమాచారం అందుకున్న వెంటనే ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర క్యాబినేట్ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించింది. హెలికాప్టర్ ఘటన వివరాలను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోదీకి వివరించారు. అనంతరం ఢిల్లీలోని జనరల్ బిపిన్ రావత్ నివాసానికి వెళ్లిన రాజ్‌నాథ్ సింగ్ ఆయన కుమార్తెలతోనూ మాట్లాడారు. బుధవారం సాయంత్రం ప్రధాని అధ్యక్షతన రక్షణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ప్రత్యేకంగా మీటింగ్ నిర్వహించింది. హెలికాప్టర్ దుర్ఘటనపై కేంద్రం గురువారం పార్లమెంటులో అధికారిక ప్రకటన చేయనుంది.
కాగా, గురువారం బిపిన్ రావత్ పార్ధీవదేహాన్ని ఢిల్లీకి తరలించనున్నారు. శుక్రవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు సందర్శనార్ధం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉంచనున్నారు. అనంతరం ఢిల్లీలోని బ్రార్ స్క్యైర్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.