హైదరాబాద్ : రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగితే బీజేపీ ఇకపై చూస్తూ ఊరుకోబోదని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తక్షణమే జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయడమే కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులను కోరారు.
ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంఛార్జీ, ఎంపీ మునుస్వామి, జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంఛార్జ్ డాక్టర్ జి. మనోహర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు వేముల అశోక్, ప్రధాన కార్యదర్శులు కుమ్మరి శంకర్, క్రాంతి కుమార్ తదితరులు హాజరయ్యారు.
• ఈ సమావేశానికి హాజరైన నాయకులంతా ఈనెల 24 నుండి చేపట్టనున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేస్తామని ముందుకు వచ్చారు.
• ఈ సందర్భంగా వారికి కృతజ్ణతలు తెలిపిన శ్రీ బండి సంజయ్ ఎస్సీ మోర్చా చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ఎస్సీలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యంత పేదరికం అనుభవిస్తున్న వారిలో దళితులే ఎక్కవుగా ఉన్నారని, వారిపై నిత్యం దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
• ‘‘ఇకపై దళితుల పక్షాన ఎస్సీ మెర్చా నాయకులంతా ఉద్యమించండి దళితులపై దాడులు జరిగితే తక్షణమే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయండి. కఠిన చర్యలు తీసుకునేలా ఉద్యమించండి. తెలంగాణలో దళితులకు బీజేపీ ఎస్సీ మోర్చా అండగా ఉంటుంది’’అని కోరారు.
• బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంచార్జ్ మునుస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ మోర్చాను మరింత బలం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై మెర్చా నాయకుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు. ఇకపై ప్రజల కోసం, పార్టీ ఉన్నతి కోసం కష్టపడి పనిచేసే మోర్చా నాయకులకు భవిష్యత్తులో అనేక అవకాశాలు లభిస్తాయని చెప్పారు.