ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. లో-బోపితో ఒక్కసారిగా కుప్పకూలడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయం బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రిలో ఉంది. రోశయ్య 1933లొ గుంటూరు జిల్లాలోని వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో రోశయ్య విద్యాభ్యాసం చేశారు.
అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ,ఎంపీగా కూడా ఆయన సేవలందించారు. 1968,74,80లలో శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో ఆయన రోడ్లు రహదారులకు, రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 2004వ సంవత్సరంలో చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. వైఎస్ కేబినెట్‌లో ఆర్ధిక మంత్రిగా పనిచేశారు. వరుసగా ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి తనదైన ముద్రవేసి రికార్డు సృష్టించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఆయన 2009 నుంచి 2011 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా వ్యవహరించారు. అనంతరం 2011 నుంచి 2016 వరకు తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు.