ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పలు దేశాల్లో తీవ్రరూపాన్ని దాల్చుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో భారత్‌లో మాత్రం కరోనా విజృంభన కాస్త మందగిస్తోంది. అంతేకాదు.. థర్డ్ వేవ్ అనేది కూడా దేశంలో ఉండకపోవచ్చంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ.. దాని ప్రభావం అంతంతమాత్రంగానే ఉండే అవకాశం ఉందన్నారు. అయితే దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతోంది. రోజు రోజుకు కరోనా బారినపడుతున్న వారి సంఖ్యకంటే రికవరీ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుండంటం శుభసూచకమని వైద్య ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తాజాగా బుధవారం నాడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో 537 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 9,283 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 10,949 రికవరీ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,11,481 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటికే దేశంలో సగం జనాభాకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని.. అందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.