కేసీఆర్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్‌లో జరిగిన రైతు సంఘాలుల చేసిన ఆందోళనలో మరణించిన రైతులకు ఒక్కొక్కరికి రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ.. వారి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అసలు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించడంలోనే కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారమివ్వని సీఎం కేసీఆర్‌ను ఎలా నమ్మాలంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఇక ఎన్సీఆర్బీ నివేదికల ప్రకారం.. టీఆర్ఎస్ పాలనలో 7,500 మంది రైతులు మృతిచెందారని.. బాధిత రైతు కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం అందలేదని ప్రశ్నించారు. అంతేకాదు.. గతేడాది హైదరాబాద్‌లో వరద బాధితులకు కూడా నష్టపరిహారం పూర్తిగా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్.. పంజాబ్‌లో మరణించిన రైతులకు పరిహారం ఇస్తామంటే ఎలా నమ్మేది అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.