కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన సన్‌రైజ్ ఓవర్ అయోధ్య పుస్తకం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పుస్తకం విడుదలైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా సల్మాన్ ఖుర్షీద్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పుస్తకంలో హిందూ మతాన్ని కించపరిచేలా పలు వ్యాఖ్యలు ఉన్నాయంటూ బీహర్ రాష్ట్రంలో ముజఫర్‌పూర్ స్థానిక చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఓ ఫిర్యాదు దాఖలైంది. ఈ ఫిర్యాదులో పిటిషినర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, పి చిదంబరం, దిగ్విజయ్ సింగ్‌లను చేర్చారు. వీరు హిందూ మతాన్ని కించపరిచినట్లు ఆరోపించారు. సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకంలో ఓ అధ్యాయం హిందుత్వానికి అవమానకరంగా ఉందంటూ పేర్కొన్నారు.
ముజఫర్‌పూర్ నగరానికి చెందిన ఆచార్య చంద్ర కిశోర్ పరాశర్.. కాంగ్రెస్ నేతలపై సెక్షన్ 121,121ఏ,123,504 కింద ఫిర్యాదును దాఖలు చేశారు. పిటిషినర్ తరఫు న్యాయవాది కమలేశ్ కుమార్ మాట్లాడుతూ.. సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకంలో సాఫ్రాన్ స్కై అనే అధ్యాయం హిందూ మతాన్ని కించపరిచేలా ఉందని.. అయితే ఈ పుస్కకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దిగ్విజయ్ సింగ్, పి చిదంబరం రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారంటూ ఆరోపించారు. కాగా, ఈ పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఓ లేఖను రాశారు. సల్మాన్ ఖుర్షీద్ హిందువులను అవమానించేలా రాశారని.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.