ప్రముఖ తెలుగు జర్నలిస్టు తీన్మార్ మల్లన్న బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. మంగళవారం నాడు ఉదయం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్‌చుగ్ సమక్షంలో తీన్మార్ మల్లన్న బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామచంద్రరావు, అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, నూనె బాలరాజ్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన తీన్మార్ మల్లన్న సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. బీజేపీ సభ్యత్వం తీసుకున్నానని.. ఇది నాకు తాడులాంటిందంటూ వ్యాఖ్యానించారు. ఈ తాడును రాష్ట్రాన్ని దోచుకుంటున్న సీఎం కేసీఆర్ కుటుంబాన్ని అమరవీరుల స్తూపానికి కట్టేసేందుకు ఉపయోగిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా జీవితంలో మూడేమూడు లక్ష్యాలు ఉన్నాయని.. అమరవీరుల తల్లిదండ్రులను పిలిచి కేసీఆర్ కుటుంబం వీపు పగలగొట్టించడం ఒకటని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద మోసకారి సీఎం కేసీఆర్ అని అన్నారు. తనపై 38 కేసులు పెట్టించారని.. దాని ద్వారా ఏం సాధించావని ప్రశ్నించారు. హుజురాబాద్‌లో ఏమైందో చూశారుగా.. నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావో.. అక్కడికే తీసుకువస్తానని.. 5 ఎకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించినావని.. మళ్లీ అక్కడికే తీసుకువచ్చే బాధ్యత తమదేనంటూ వ్యాఖ్యలు చేశారు.