పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశౄరు. ఆర్టికల్ 370ని మోదీ సర్కార్ నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆర్టికల్ 370ని రద్దు చేసిన మోదీ సర్కార్.. ఆ తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను (పీవోకే)ను కూడా స్వాధీనం చేసుకుంటుందని జితేంద్ర సింగ్ అన్నారు. అంతేకాదు.. ఇదే తమ తదుపరి ఏజెండా అన్న సంకేతాలు కూడా ఇచ్చేశారు. ఇటీవల యూఎన్ సభలో కూడా భారత్ తరఫు అధికారులు.. పాక్‌కు డైరక్ట్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పాక్ బలగాలు పీవోకే నుంచి వెళ్లిపోవాలని యూఎన్ వేదికగా పాక్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం నాడు ఢిల్లీలో నిర్వహించిన మిర్పూర్ బలిదాన్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పీవోకే విషయంపై మాట్లాడుతూ ఇక స్వాధీనమే అన్న వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు కాదని అనేకమంది అభిప్రాయపడ్డారని.. కానీ మోదీ సర్కార్ రద్దు చేసి చూపించిందని.. ఇదే విధంగా పీవోకే ను కూడా స్వాధీనం చేసుకుని చూపిస్తోందంటూ ధీమా వ్యక్తం చేశారు.