కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో దేశంలో కూడా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూను విధించగా.. ఢిల్లీ సర్కార్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధానిలో ఒమైక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో దీనిని అరికట్టేందుకు ఈ ప్రకటన చేసింది. వరుసగా రెండు రోజులుగా కరోనా పాజిటివ్ రేటు కూడా 0.5శాతానికి పైగా ఉంటోందని.. దీంతో లెవల్-1 అలర్ట్ ప్రకటించామని.. వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోబోతున్నామని.. దీనిపై ప్రత్యేక ప్రణాళికలను తీసుకువస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఇదిలావుంటే పొరుగు రాష్ట్రమైన పంజాబ్ మరింత కఠిన నిర్ణయాలను తీసుకుంటుంది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోని వారికి జనవరి 15వ తేదీ నుంచి బహిరంగ ప్రదేశాల్లో అనుమతులు ఉండయని ప్రకటించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటన కూడా చేసింది. జనవరి 15వ తేదీ నుంచి పబ్లిక్ ప్లేసెస్‌లో తిరగాలంటే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని తెలిపింది.