ఒక ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయ గతిని మార్చివేసింది. సరిగ్గా ఏడాది క్రితం వచ్చిన ఫలితం అధికార పార్టీ అహాంకారాన్ని నిలపగలమని రుజువు చేసింది. ఉద్దండులు ఉన్నా సరే తెలంగాణకు తామే చాంపియన్ లు అని చెప్పుకునే వారి మధ్యన బురదలోంచి కమలం పువ్వు ఉదయించింది. తెలంగాణ రాజకీయాలకు కొత్త అర్ధాన్ని అందించింది.. అదే దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం
ఎంతలా అంటే తెలంగాణ రాజకీయాలను దుబ్బాక ఉప ఎన్నికల ముందు , దుబ్బాక ఎన్నికల తర్వాత అన్నట్టు గీటు రాయి గీసింది . సిద్ది పేట జిల్లాలో కూడా కేసీఆర్ కు ఎదురు నిల్చొని రాజకీయాల్లో విజయాలు సాధించగలమని నిరూపించింది. కేసీఆర్ కు సరయిన ప్రత్యర్ధి ఉంటే ప్రత్యామ్నాయం గా మారవచ్చు అని చెప్పింది. బరిగీసి నిలిచితే కేసీఆర్ ను టీఆర్ఎస్ పార్టీని మట్టికరపించడం పెద్ద విషయం కాదన్నట్టుగా దుబ్బాక ఫలితం ఎలుగెత్తి చాటింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో , హరీశ్ రావు, కేటీరామారావు ల మధ్యన ఉండే దుబ్బాకలో టీఆర్ఎస్ పై కమలం పార్టీ వికసించడం ఒక చరిత్రగా మిగలనుంది. ఏండ్లుగా కేసీఆర్ మీద పోరాటం చేస్తున్న వారికి, ఇక కేసీఆర్ ను ఎదుర్కోలేమని కాడి ఎత్తేసిన వారికి ఒకింత ఆశ్చర్యం, మరింత భవిష్యత్ పై నమ్మకం కలిగించింది దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం .
అధికార పార్టీ చతురంగ బలాలను ప్రయోగించినా, పోరాటంలో బీజేపీ పై చేయి సాధిస్తోందని అర్ధం అయిన తర్వాత పోలీసులను ప్రయోగించినా , రఘునందన్ రావుకు ఝలక్ ఇవ్వాలని చేసిన ప్రతీ ప్రయత్నం కూడా అధికార పార్టీకే బూమరాంగ్ అయ్యింది. తొలిసారిగా దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ ఉప ఎన్నికల్లో వాడిన అన్ని వనరులను కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రయోగించింది. అయినా కాషాయం జెండా నీడన బలమైన నాయకుడు రఘునందన్ రావు బీజేపీ జెండా ఎగరవేసింది. ఈ ఫలితాలు తెలంగాణ రాజకీయాలలో ఓ కొత్త ఒరవడిని సృష్టించాయి. ఆశలు రేకెత్తించాయి .
దుబ్బాక ఫలితాల వెంటనే తేరుకున్న కేసీఆర్ ఆ ఫలితాల ప్రకంపనలు తెలంగాణ అంతటా వ్యాపించకుండా ఉండేందుకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను నాలుగె నెలలు ముందుకు జరిపి బంపర్ మెజారిటీ ద్వారా దుబ్బాక ఫలితాలను మరిపించే ఎత్తుగడ వేశారు. కానీ అపర చాణక్యుడు అని చెప్పుకునే కేసీఆర్ వ్యూహం దుబ్బాక ఫలితాల వేడిగాలి ముందు చిత్తయ్యింది. నాలుగు స్థానాల బీజేపీ 48 స్థానాలకు ఎగబాకి టీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన గత్యంతరాన్ని సృష్టించింది. ఇది కూడా ఇతోదికంగా బీజేపీ లాభపడే అంశమే .
దుబ్బాకలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాష్టీకం తో ప్రజలు మరింత కోపోద్రిక్తులయ్యారు. ఈ సారి అధికార పార్టీకి బుద్ది చెప్పాలని , దుబ్బాకలో రఘునందన్ గెలిస్తే రాష్ట్రంలో ఒక ప్రశ్నించే గొంతుగా ఉంటాడనే నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు . చివరి వారంలో వచ్చిన ఇంటెలిజెన్స్ నివేధిక, చేసుకున్న సర్వేలను చూసిని ఇంచార్జి హరీశ్ రావు దుబ్బాకలో చేసిన ఘనకార్యాల వల్ల అప్పటివరకు ఆయనకున్న ఇమేజ్ ను అమాంతం పాతాళంలో కలిపింది.
గాలివాటంటో రఘనందన్ గెలిచాడని, అది బీజేపీ విజయం కాదని , రఘునందన్ సొంత విజయం అని చెప్పే ప్రయత్నం చేసినా కూడా గ్రేటర్ హైదరాబాద్ మంచి విజయాలు, వరంగల్ ,ఖమ్మం కార్పోరేషన్ లో విజయాలు, సాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల శాతం ద్వారా పార్టీకి మరింత పటిష్టమైన పునాదులు పడ్డాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టగలిగేది, ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ అని రుజువు చేసింది.
దుబ్బాక విజయమే లేకపోతే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఇంత వేగంగా ఎదిగే అవకాశం రాకపోయిండేది, పీసీసీ అద్యక్షుడిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బీజేపీని ఎవరూ పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. హుజూరాబాద్ లో ఈటెల రాజేంద్ కూడా బీజేపీ వైపు వచ్చి ఉండే అవకాశమే లేదు. బీజేపీ రాష్ట్ర అద్యక్షుడిగా బండి సంజయ్ వచ్చిన వేళా విశేషం వెంటనే దుబ్బాక ఫలితం రావడంతో ఇప్పుడు అధికార పార్టీకి బీజేపీ సై అంటూ సవాల్ విసరగలిగింది.