కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా, కరోనా రెండో వేవ్‌ను అద్వితీయ రీతిలో, అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. యూపీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా, అభివృద్ధి దాయక పాలన అందిస్తోందన్నారు. యూపీలోని తన సొంత లోక్‌సభ నియోజకవర్గం వారణాసికి ప్రధాని మోదీ గురువారం వచ్చారు.
బెనారస్ హిందూ యూనివర్సిటీ– ఐఐటీ(ఐఐటీ–బీహెచ్‌యూ) వద్ద రూ. 15 వందల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆ తరువాత, జపాన్ సహకారంతో నిర్మితమైన ‘ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్– రుద్రా„Š ’ను ప్రారంభించారు. కోవిడ్ 19పై ఉత్తరప్రదేశ్ పోరాటం అద్వితీయమని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. ‘యూపీ జనాభా డజనుకు పైగా దేశాల జనాభా కన్నా ఎక్కువ. ఆ రకంగా చూస్తే కరోనాను యూపీ కట్టడి చేసిన తీరు అద్వితీయం అని చెప్పవచ్చు’ అని ప్రశంసించారు. గతంలో రాష్ట్రంలో ఆరోగ్య వసతులు సరిగ్గా ఉండేవి కావని, చిన్న చిన్న సమస్యలు కూడా ప్రాణాంతకమయ్యేవని ప్రధాని గుర్తు చేశారు.
యూపీలో మెదడువాపు వ్యాధి వంటి జబ్బులను కట్టడి చేయడంలో చాలా ఇబ్బంది ఎదురైందన్నారు. కానీ అత్యంత తీవ్రమైన కోవిడ్ మహమ్మారిని ప్రస్తుత ప్రభుత్వం గొప్పగా ఎదుర్కొన్నదన్నారు. గత కొన్ని నెలలు మానవాళికి అత్యంత కఠినమైనవని, వాటిని కూడా కాశి(వారణాసి) ప్రజలు గొప్పగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు. ‘యూపీలో న్యాయమైన పాలన నడుస్తోంది. మాఫియారాజ్, ఉగ్రవాదాలను సమర్థవంతంగా నిరోధించారు. నేరస్తులు మన అక్క చెల్లెళ్ల వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు. యోగి ఆదిత్యనాథ్ సమర్థవంతమైన పాలన కారణంగా రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు 8 వేల కోట్ల ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయన్నారు.