మారిన హుజూరాబాద్ రాజకీయ సమీకరణలు
సంచలన వ్యాఖ్యలతో దూసుకుపోతున్న బండి సంజయ్ కుమార్
అవినీతి, కుటుంబ పాలనను ఎండగడుతూ టీఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెడుతున్న వైనం
కేంద్ర నిధుల వివరాలను గ్రామగ్రామానికి వివరిస్తూ చర్చకు తెరలేపిన బండి
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపైనా టీఆర్ఎస్ కు ధీటుగా స్పందిస్తున్న సంజయ్
టీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారిన ఉప ఎన్నికలు
గత కొద్దినెలలుగా నువ్వా? నేనా? అన్నట్లుగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎత్తులు, పై ఎత్తులతో ప్రచారం నిర్వహిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతోపాటు మరికొంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొంది. అటు ప్రచారంలోనూ, ఇటు ప్రజాదరణలోనూ కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడిపోయింది. ఒకవైపు జాతీయ, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరు వెంకట్ స్థానికేతరుడు కావడం ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లు సైతం ఇతర పార్టీలవైపు చూసే పరిస్థితి నెలకొంది. దీంతోపాటు హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కే అవకాశాలు కూడా సన్నగిల్లాయని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో 60 వేలకుపైగా ఓటర్లు కాంగ్రెస్ కు ఓటేశారు. వారంతా ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఆ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఈ విషయంలో నువ్వా? నేనా అన్నట్లుగా ఉన్నప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రంగ ప్రవేశంతో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయని హుజూరాబాద్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బండి సంజయ్ కుమార్ ఒకవైపు సంచలన వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకుంటూనే….మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఖర్చు చేసిందనే వివరాలను గణాంకాల వారీగా చెబుతూ చర్చకు తెరలేపారు. బండి సంజయ్ కుమార్ ఏ గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లినా తొలుత ఆ గ్రామంలో ఉపాధి హామీ పథకం, మొక్కల పెంపకం, మరుగుదొడ్ల నిర్మాణం, పల్లె ప్రక్రుతి భవనాల నిర్మాణం, రైతు వేదికల నిర్మాణం తోపాటు వీధి దీపాలు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలకు కేంద్రమే నిధులిస్తోందని గణాంకాలతోసహా వివరిస్తున్నారు. చివరకు వైకుంఠ ధామాల పేరిట నిర్మిస్తున్న స్మశాన వాటికలకూ కేంద్రమే లక్షల రూపాయలు చెల్లిస్తోందని చెబుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా కేంద్రం ఇంత పెద్ద ఎత్తున నిధులిస్తున్నా…ఎందుకు పూర్తి స్థాయిలో ఖర్చు కావడం లేదని? ఆ నిధులన్నీ ఏమయ్యాయనే చర్చ జోరుగా సాగుతోంది. బండి సంజయ్ వెల్లడిస్తున్న గణాంకాలన్నీ వాస్తవాలే కావడంతో వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్ధం కాక టీఆర్ఎస్ నాయకత్వం ఇరకాటంలో పడింది.
మరోవు టీఆర్ఎస్ నాయకత్వం కేంద్రం పెట్రోలు, గ్యాస్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై భారాన్ని మోపుతోందంటూ బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు తీవ్ర స్థాయిలో క్రుషి చేస్తోంది. మంత్రి హరీష్ రావుసహా టీఆర్ఎస్ నాయకులంతా ఇదే విషయాన్ని చెబుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే బండి సంజయ్ కుమార్ మాత్రం ఊహంచని విధంగా రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడానికి టీఆర్ఎస్సే కారణమంటూ ఎదురుదాడి చేస్తున్నారు. రాష్ట్రంలో లీటర్ పెట్రోలు ధర రూ.100కు పైగా ఉందని, అందులో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాట్, ఇతరత్రా పన్నుల రూపేణా 41 రూపాయలు దోచుకుంటోందని గణాంకాల తో సహా వివరిస్తున్నారు. లీటర్ పెట్రోల్ పై ఏకంగా 41 రూపాయలకు పైగా దోచుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పేరిట ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని దండుకుంటోందని చెబుతున్నారు. టీఆర్ఎస్ కు నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే ఆ పన్నులను మినహాయిస్తే రాష్ట్ర ప్రజలకు లీటర్ పెట్రోలు 60 రూపాయలకే లభిస్తుందని చెబుతూ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెరగానికి రాష్ట్ర ప్రభుత్వం కారణమనే అంశాన్ని ప్రజలకు అర్ధమయ్యేటట్లుగా బండి సంజయ్ వివరిస్తూ చర్చకు తెరలేపడంతో టీఆర్ఎస్ వర్గాలు ఆత్మరక్షణలో పడ్డాయి. దళిత బంధు ఆగడానికి టీఆర్ఎస్సే కారణమంటూ వివరించడంతోపాటు రైతులకు కేంద్రం ఎరువుల కొనుగోలు భారం కాకుండా ఉండేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం ఏటా రూ.79 వేల కోట్లు సబ్సిడీగా భరిస్తున్న విషయాన్ని అర్ధమయ్యేలా వివరిస్తూ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. వాస్తవానికి బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు టీఆర్ఎస్ నేతలు ఈ అంశాలను లేవనెత్తి ఓట్లు పొందాలని భావించినప్పటికీ చివరకు ఆ పార్టీకి ప్రతికూలంగా మారే ప్రమాదం ఏర్పడిందని టీఆర్ఎస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతిపై టీఆర్ఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాడివేడిగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ విషయంలో బండి సంజయ్ దూకుడుగా వెళుతున్నారు. గత కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలతో పోలిస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం నీతిమంతమైన పాలన అందిస్తోందని జాతీయ మీడియాసహా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న వాస్తవాలను బండి సంజయ్ ప్రస్తావించడంతో కేసీఆర్ పాలనలో కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయసహా వివిధ పనుల్లో పెద్ద ఎత్తున జరిగిన అవినీతిని ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ ను ఇరకాటంలో పడేస్తున్నారు. అదే సమయంలో వారసత్వ రాజకీయాల అంశాన్ని ప్రచారాస్ర్తంగా మలుచుకున్నారు. నరేంద్ర మోదీ నిరాడంబర పాలనతోపాటు వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉన్న పార్టీ బీజేపీ అయితే రాష్ట్రంలో కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, కూతురు కవిత, మరదలి కొడుకు సంతోష్ రావు ప్రధాన పదవుల్లో ఉంటూ ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారంటూ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెబుతూ ప్రజల్లో ఆలోచనను రేకెత్తిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ కు కేసీఆర్ ప్రెసిడెంట్ అయితే….కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, హరీష్ రావు స్టాండింగ్ ప్రెసిడెంట్, కవిత సిట్టింగ్ ప్రెసిడెంట్, సంతోష్ రావు స్లీపింగ్ ప్రెసిడెంట్ ఉంటూ సెటైర్లు వేస్తుండటంతో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇదే అంశంపై చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది. మొత్తమ్మీద బండి సంజయ్ కుమార్ రాకతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతోపాటు రాజకీయ సమీకరణలన్నీ బీజేపీకి అనుకూలిస్తుండటం గమనార్హం.