జనగామ : రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడుతోన్న యోధులను చుట్టుముట్టి నైజాం సైన్యం 118 మంది నిజాం వ్యతిరేక పోరాట వీరులను బలిదీసుకున్న దినం ఆగస్టు 27 ను ప్రభుత్వం జరపాలని రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు కూడా ఈ విషయంలో శ్రద్ద చూపాలని, పార్టీ పరంగా ప్రతీ ఆగస్టు 27 న అమరుల సంస్మరణ దినం జరపాలని ఆయన విజ్ఙప్తి చేశారు.
ఈ సంవత్సరం ఆగస్టు 27 న బైరాస్ పల్లిలో సంస్మరణ సభ జరుపుతున్నట్టు వెల్లడించారు . ఆగస్టు 27 శుక్రవారం నాడు బైరాన్ పల్లిలో అమరులయిన 118 మంది ఆత్మశాంతి కోసం పితృయజ్ఙం, పిండదానం జరుపుతున్నట్టు వెల్లడించారు . తెలంగాణ పోరాట యోధులు ఇంతమంది మరణించి మరో జలియన్ వాలాబాగ్ లాంటి సంఘటన జరిగినా కూడా తర్వాత ప్రభుత్వాలు అంతగా పట్టించుకోలేదని , ఇప్పటికయినా నిజ చరిత్ర భవిష్యత్ తరాలకు అందించడమే కాకుండా మనకు స్వేచ్చ కల్పించడానికి అమరులయిన వారిని గుర్తు చేసుకోవడం మన బాధ్యత, ధర్మం అన్నారు.
ఈ యజ్ఙంలో పాల్గొనాలని అధికార టీఆర్ఎస్ కార్యనిర్వాహక అద్యక్షుడు కే.తారకరామారావు, బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వైఎస్సార్టీపీ అద్యక్షురాలు శర్మిల కు విడివిడిగా లేఖలు రాసినట్టు వెల్లడించారు.
పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నా అసదుద్దీన్ ఒవైసీ ఈ విషయాన్ని గుర్తించి వారి కార్యకర్తలను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆనందభాస్కర్ విజ్ఙప్తి చేశారు .