దేశ వ్యాప్తంగా మరికొన్ని నెలల్లో మిని సంగ్రామం జరగబోతున్న సంగతి తెలిసిందే. పంజాబ్, యూపీ వంటి రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉండగా.. ఆ తర్వాత మరికొద్ది రోజులకే మరికొన్ని రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్, యూపీలో ఈ మార్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ తిరిగి హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. యూపీలో మరోసారి కమల ప్రభంజనం చూపేందుకు యోగీ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మ్యానిఫెస్టోను కూడా రెడీ చేస్తూ.. అన్ని వర్గాలకు పెద్దపీట వేసేందుకు రెడీ అయ్యారు. అయితే మంగళ వారం నాడు మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చెత్తతో పోల్చడం చర్చనీయాంశమైంది.
అనేక మంది కాంగ్రెస్ నేతలు ఆప్‌ను సంప్రదిస్తున్నారని.. తమ పార్టీలోకి కాంగ్రెస్ నేతలను చేర్చుకోవడం ప్రారంభిస్తే పంజాబ్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు చేరేందుకు రెడీగా ఉన్నారని.. అంతేకాకుండా మరికొందరు ఎంపీలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని కేజ్రీవాల్ అన్నారు. అయితే తాము ఆ చెత్తను తీసుకునేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సీఎం అభ్యర్ధిని అందరికంటే ముందే ప్రకటిస్తామన్నారు. అంతేకాదు.. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసినట్లుగానే.. పంజాబ్‌లో కూడా డెవలప్ చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.