సీఎం కేసీఆర్ ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ అటాక్‌కు దిగారు. సీఎం కేసీఆర్‌పై తనదైన స్టైల్‌లో పంచ్‌లు వేస్తూ.. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలే అంటూ దుమ్మెత్తిపోశారు. కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యం చేస్తూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
వరి కోనడంపై..
అసలు గంటకో మాట్లాడేది ఎవరంటూ ప్రశ్నించారు. గంటకో మాటా మాట్లాడుతూ తెలంగాణ రైతులను సీఎం కేసీఆర్ ఆగం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి కొంటామంటూ కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిందన్నారు. “ధాన్యాన్ని కేంద్రం కొంటుందా.. లేదా రాష్టం కొంటుందా..? ఇన్నాళ్లు కేంద్రమే వడ్లు కొన్నదని.. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని కేంద్రం లేఖలో పేర్కొందని.. కేంద్రం పంపిన లేఖ కేసీఆర్‌కు వచ్చిందా.. రాలేదా?” అని ప్రశ్నించారు.
రైతు చట్టాల విషయంలో..
ఇక రైతు చట్టాల విషయంలో సీఎం కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతారని.. మార్కెట్ కమిటీలను రద్దు చేస్తామని కేంద్రం ఎప్పుడు చెప్పిందని ప్రశ్నించారు. దీనికి సంబంధించి కేసీఆర్‌కు దమ్ముంటే ఆధారాలు చూపించాలంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి ఎక్కడ సాగవుతుందో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. ఒకసారి వరి వద్దంటూ.. మరొకసారి పత్తి వద్దంటూ.. రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో సీఎం కేసీఆరే చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.
పెట్రోల్, డీజీల్ ధరలపై..
సీఎం ప్రెస్‌మీట్ పెడితే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ప్రకటన చేస్తారనే ఆశించామని.. కానీ అది జరగలేదన్నారు. దేశంలో 24 రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తగ్గించదని సీఎం కేసీఆర్‌ను బండి సంజయ్ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎందుకు తగ్గించరో చెప్పాలని.. లీటర్ పెట్రోల్‌పై రాష్ట్రానికి రూ. 28 వస్తోందని.. అది కాకుండా కేంద్రం నుంచి మరో రూ.12 కూడా వస్తుందంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు. పెట్రోల్, డీజీల్‌పై వ్యాట్ పెంచలేదని సీఎం కేసీఆర్ చెబుతున్నారని.. కానీ 2015లో తెలంగాణ రాష్ట్ర వ్యాట్ పెంచిందని..అందుకు సంబంధించిన జీవోలు కూడా ఉన్నాయంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.