తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సోమవారం నాడు మిర్యాలగూడలో జరిగిన ఘటనను గుర్తుచేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల కోసం ఎంతవరకైనా పోరాడేందుకు రెడీగా ఉన్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మమ్మల్ని అడ్డుకుంటూ దాడులు చేయడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల కోసం ఎన్ని దాడులు జరిగినా సహిస్తామని.. రైతులందరికీ అండగా ఉంటామన్నారు. ఫాం హౌస్‌కు మాత్రమే పరిమితమైన సీఎం కేసీఆర్‌కు.. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ది చెప్పి.. శాశ్వతంగా ఫాం హౌస్‌కే పరిమితం చేసే రోజులు వస్తాయన్నారు. రైతుల ముసుగులో టీఆర్‌ఎస్ శ్రేణులు తమపై దాడి చేయడమే కాకుండా.. బాధలను చెప్పుకునేందుకు వస్తున్న రైతులపై కూడా దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
కాగా, మంగళవారం నాడు సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల సమీపంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిస్తూ.. ఘర్షణ వాతావరణాన్ని తలపించారు. ఈ క్రమంలోనే పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఓ ఆటోలో పెద్ద ఎత్తున ఉన్న కర్రలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి సూర్యపేటకు వచ్చే బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు.