శ్రీ అరబిందో తన కలంతో దేశాన్ని కదిలించారు: స్వామి శితికంఠానంద
హైదరాబాద్: శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా విద్యానగర్‌లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరక్టర్ స్వామి శితికంఠానంద అనుగ్రహభాషణం చేశారు. స్వామి వివేకానంద తన కంఠంతో దేశ ప్రజలను ఉత్తేజితులను చేస్తే శ్రీ అరబిందో తన కలంతో దేశాన్ని కదిలించారని చెప్పారు. శ్రీ అరబిందో, స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ పరమహంస వంటి మహనీయుల చరిత్రలు విద్యలో భాగం కావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వాధ్యాయం ద్వారా తమను తాము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శితికంఠానంద చెప్పారు.
కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేసిన అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ చలమాయి రెడ్డి మాట్లాడుతూ సనాతన ధర్మంపై శ్రీ అరబిందో ఆధ్యాత్మిక ఆలోచనలను ఆవిష్కరింపచేశారు.
జాగృతి ఎడిటర్ గోపరాజు నారాయణ రావు తమ ప్రసంగంలో శ్రీ అరబిందో జీవితంలోని ప్రధాన ఘట్టాలను స్పృశించారు. శ్రీ అరబిందో భారతదేశాన్ని ఒక మాతృమూర్తిగా దర్శించారని చెప్పారు. అరబిందో రచించిన సుదీర్ఘ కవితా స్రవంతి సావిత్రి భారతదేశ సాహితీ సాగరంలోనే ఆణిముత్యమన్నారు.
అరబిందో సొసైటీ ప్రతినిధి ములుగు శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ అరబిందో ప్రవచించిన ఆధ్యాత్మిక జాతీయవాదం గురించి ప్రస్తావించారు. కవి, తత్వవేత్త,, యోగి, రచయిత, జర్నలిస్ట్‌గా శ్రీ అరబిందో చెరగని ముద్ర వేశారని చెప్పారు.
భారత్ టుడే డైరక్టర్ వల్లీశ్వర్ మాట్లాడుతూ ఐదు సకారాలైన సంకల్పం, సాధన, సంస్కారం, శక్తి, సత్యాలకు సాకార రూపమే శ్రీఅరబిందో అన్నారు. ఈ ఐదింటినీ జీవితంలోకి తెచ్చుకుంటే ప్రతి ఒక్కరూ ఒక అరవిందుడు కావొచ్చన్నారు.
సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్ రెడ్డి ప్రసంగిస్తూ నిజమైన భారతీయుడంటే విశ్వమానవుడన్నారు.
కార్యక్రమంలో పలువురు సీనియర్, యువ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ సభ్యులు పాల్గొన్నారు.