వరి కొనుగోలు విషయంపై సీఎం కేసీఆర్ కేంద్రం పట్ల అసహనంతో ఉన్న విషయం తెలిసిందే. కేంద్రం వైఖరిపట్ల టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో గురువారం నాడు నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో సీఎం కేసీఆర్‌తో సహా.. మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఇతర కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం తీరును నిరసిస్తూ.. యుద్ధానికి దిగామని.. ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. రాబోయే రోజుల్లో దీనిని మరింత ఉధృతం చేస్తామని హెచ్చిరించారు. పంజాబ్ రాష్ట్రంలో కొన్న విధంగానే ఇక్కడ కూడా వరి కొనుగోళ్లు చేపట్టాలంటూ కేంద్రాన్ని కోరినామని సీఎం కేసీఆర్ తెలిపారు. అంతేకాదు.. ప్రధానికి లేఖ రాసిన కూడా ఉలుకు పలుకు లేదని విమర్శలు గుప్పించారు. కేంద్రం దిగివచ్చి రైతులకు న్యాయం చేసే వరకు ఈ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
జనం మధ్యలోనే మంత్రి కేటీఆర్
ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద టీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన ధర్నాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వరి కొనుగోలు విషయంపై కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ చేపడుతున్న ధర్నాలో.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జనం మధ్యలోనే కూర్చున్నారు. ధర్నా చౌక్ వద్ద స్టేజ్ మీదకు వెళ్లకుండా జనం మధ్యలోనే కూర్చోవడం చూసి కార్యకర్తలు ఆసక్తికరంగా తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల, జగదీశ్వర్,పువ్వాడతో పాటుగా.. ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.