పొలిటికల్ వాయిస్ డాట్ కామ్ న్యూస్,ముంబయి, మే 22,2025:యశ్ రాజ్ ఫిలింస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ టీజర్ బుధవారం విడుదలైంది. సోషల్‌మీడియా వేదికగా సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఆ టీజర్‌ను షేర్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్‌కు “నరకానికి స్వాగతం” అంటూ ఘాటు సందేశం పంపారు. హృతిక్ పోషించిన కబీర్ పాత్రతో అభిమానుల్ని కట్టిపడేస్తూ, టీజర్ ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తోంది.
“ఇదిగో ప్రారంభమవుతుంది ఎన్టీఆర్… సిద్ధంగా ఉండు… ఇక్కడ దయకు చోటు లేదు… నరకానికి స్వాగతం! ప్రేమతో… కబీర్” అంటూ హృతిక్ సందేశం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. 1 నిమిషం 34 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌లో విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
2019లో వచ్చిన వార్ చిత్రం భారీ విజయం సాధించగా, తాజాగా అదే ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వార్ 2 వస్తోంది. ఈ సారి హృతిక్‌కు తోడుగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. గతంలో ఇలా భారీ బడ్జెట్ స్పై యాక్షన్ సినిమాల్లో నటించన జూనియర్ ఎన్టీఆర్ విలన్‌గా కనిపించనున్నారని టీజర్ స్పష్టంగా తెలియజేస్తోంది.

కబీర్ పాత్రలో హృతిక్ ఈ సారి మరింత పవర్‌ఫుల్‌గా, శత్రువులను చీల్చి చెదరగొట్టేలా కనిపించారు. కత్తి, బాంబులు, కార్‌చేజ్‌లు, దూకుడు యాక్షన్‌తో హృతిక్ మళ్లీ తన సత్తా చాటారు. “వార్ 2” ఎండ్ క్రెడిట్‌గా టైగర్ 3లో హింట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఈ చిత్రం ద్వారా దర్శకుడు అయాన్ ముఖర్జీ తొలిసారి హృతిక్‌తో కలిసి పనిచేస్తున్నారు. కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హృతిక్ 25 ఏళ్ల సినీ ప్రయాణం సందర్భంగా వస్తున్న ఈ చిత్రం మరో మైలురాయిగా నిలవనుంది. ధూమ్ 2, అగ్నిపథ్, విక్రమ్ వేద వంటి చిత్రాలతో ఆకట్టుకున్న హృతిక్, ఇప్పుడు వార్ 2 ద్వారా మళ్లీ ప్రేక్షకుల్ని మైమరిపించేందుకు సిద్ధమయ్యారు.
వార్ 2 చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.