గురువారం సాయంత్రం, హోటల్ దస్ పల్లాలో కార్యక్రమం
నవంబర్ 17, 2021, హైదరాబాద్
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీక అయిన రామాయణంపై ఇప్పటికే ఎన్నో వివరణలు, విశ్లేషణలు వచ్చాయి. ప్రతి వివరణా.. రామాయణానికి సంబంధించిన మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అయితే ఆధునిక కాలంలో పద్య కావ్యాలు రాయడం అరుదు. కానీ ప్రభుత్వ అధికారిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వద్ద అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కవి శశికిరణ్ కొమాండూర్ ‘శ్రీమద్రామాయణం” పద్యమహా కావ్యం రాయడం విశేషం. శశికిరణ్ కొమాండూర్ గతంలో తెలుగోడు గేయకావ్యం రాసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ శ్రీమద్రామాయణం పుస్తకాన్ని ప్రముఖ ప్రచురణా సంస్థ ఎమెస్కో పబ్లిషర్స్ ముద్రించింది.
ఈ పుస్తకాన్ని గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు నవంబర్ 18వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హోటల్ దస్ పల్లాలో ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆత్మీయ అతిథిగా పాల్గొంటుండగా, శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఆప్తవాక్యాన్ని అందించనున్నారు.