పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు పెద్దన్నలాంటి వాడంటూ పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శనివారం నాడు పాక్‌లోని కర్తార్‌పూర్ కారిడార్ నుండి గురుద్వారా సాహిబ్‌కు వెళ్లిన సిద్దూ.. ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ క్రమంలో పాక్‌లోని కర్తార్‌పూర్ కారిడార్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సీఈవో మహ్మద్ లతీఫ్ సిద్దూకు సరిహద్దువద్ద స్వాగతం పలికారు. ఈ క్రమంలో సిద్దూ మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ అంటే నాకు ఎంతో గౌరవం.. ఆయన్ను చాలా అభిమానిస్తాను. ఇమ్రాన్ నాకు పెద్దన్నలాంటివాడు. అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం జరిగింది. సిద్దూ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, హిందూత్వాన్ని విమర్శిస్తున్న వయనాడ్ ఎంపీ రాహుల్ గాధీతో పాటుగా.. పలువురు కాంగ్రెస్ నేతలతో నవజ్యోత్‌సింగ్ సిద్ధూ వ్యాఖ్యలు ముడిపడి ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌పాత్ర అన్నారు. పాక్‌ను పొగిడితే సంతోషంచే వర్గం కూడా ఉందని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోందని.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు సిద్దూ చేశారన్నారు. కాగా, సిద్ధూ గతంలో కూడా ఇమ్రాన్ ఖాన్‌ని, పాక్‌ని పొగుడుతూ.. పాక్ వెళ్లినప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ కమర్‌జావెద్ బజ్వాను ఆలింగనం చేసుకున్నారని సంబిత్ పాత్ర గుర్తు చేశారు.
ఇమ్రాన్ అన్న అయితే.. మరి హఫీజ్ సయీద్..?
నవజ్యోత్ సింగ్ సిద్దూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్టర్ ద్వారా స్పందించారు. నీకు నవజ్యోత్ సింగ్ సిద్దూ అన్నయ్య అయితే.. మరి హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి వారు ఆయనకు తండ్రిలాంటి వారవుతారంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.