నల్ల్గొండ, వరంగల్ : తెలంగాణలో పాలన ఫాంహౌజ్ కు పరిమితం అయ్యిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిందేనని కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన తెలంగాణ విచ్చేశారు. విజయవాడ నుండి కోదాడ కు చేరుకున్న ఆయనకు నల్లబండగూడెం వద్ద బీజేపీ కార్యకర్తలు ఘనంగా తెలంగాణలోకి స్వాగతం పలికారు .
బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ , జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ, మధ్యప్రదేశ్ ఇంచార్జి మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, ఎస్. కుమార్ తదితర నాయకులు తెలంగాణ లోకి స్వాగతం పలికారు. వేలాది మంది కార్యకర్తలు కిషన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. తొలిసారి క్యాబినెట్ మంత్రిగా రావడంతో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు వేసి వేలాది వాహనాలలో కోదాడ చేరుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారి వచ్చిన కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవి కావడంతో తెలంగాణ బీజేపీ మొత్తం అక్కడకు చేరుకుంది.
అనంతరం ఆయన కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు . తర్వాత సూర్యాపేట పట్టణానికి ర్యాలీగా చేరుకుని అక్కడ సభలో మాట్లాడారు . రాత్రి సూర్యాపేట పట్టణంలోనే బస చేశారు. గల్వాన్ లో అమరుడయిన కల్నల్ సంతోశ్ బాబు విగ్రహానికి నివాళులర్పించారు. కరోనా సమయంలో సెలవు పెట్టకుండా పనిచేసి మన్ననలు అందుకున్న మారతమ్మ ఇంట్లో కిషన్ రెడ్డి ఉదయం అల్పాహరం చేశారు .
సూర్యాపేట నుంచి దంతాలపల్లి చేరుకుని ప్రజలనుద్దేశించి మాట్లాడారు . అక్కడి నుంచి వరంగల్ నగరానికి చేరుకున్నారు . అక్కడ వేయిస్థంబాల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.