హైదరాబాద్ : హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్ధి ఎన్ఎస్ యూఐ నాయకుడు బల్మూరి వెంకట్ అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. నెలలుగా నాన్చి పెద్ద పెద్ద నాయకుల పేర్లు చర్చించినా కూడా అక్కడ చివరికి కాంగ్రెస్ అనుబంధ విద్యార్ధి సంఘ నాయకుడు వెంకట్ ను పార్టీ పెద్దలు ఖరారు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కూడా మొదలవ్వనుంది. ఇప్పటికే రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్ధిగా రంగంలో ఉండగా టీఆర్ఎస్ పార్టీ విద్యార్ధి నాయకుడు గెల్లుశ్రీనివాస్ కు టిక్కెట్ కేటాయించింది.
రాజీనామా చేసిన నుంచే బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ ప్రజల్లో పాదయాత్ర, ప్రచారం ప్రారంభించగా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మంత్రులు, నాయకులు మోహరించారు. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు ప్రారంబోత్సవం పేరుతో సభ కూడా నిర్వహించారు. అధికార టీఆర్ఎస్, రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ ప్రచారం మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా పోటా పోటీగా సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ ఆరోపణలు , ప్రత్యారోపణలు సాగదుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ధీటైన అభ్యర్ధిని వెతకడం కష్టంగా మారింది. దీంతో తెలంగాణ రాష్ట్రం యావత్తును దృష్టిని ఆకర్షిస్తోన్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ మాత్రం బీజేపీ – టీఆర్ఎస్ మధ్యనే సాగుతున్నది. ఓటమి నుంచి తప్పించుకుని తమ పట్టును నిలుపుకోవడానికి అధికార పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతున్నది.